
చినంగాకు అనేది చూడటానికి మన గోరింటాకు లాగే ఉంటుంది. ఇందులో విటమిన్ ఏ సమృద్ధిగా ఉండటం వల్ల కంటి చూపును మెరుగుపరచడమే కాకుండా బీపీ, షుగర్ నియంత్రణకు అద్భుతంగా తోడ్పడుతుంది ఈ రెండు హెల్తీ పచ్చళ్లను ఇంట్లోనే ఎంతో సులభంగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ కథనం ద్వారా వివరంగా తెలుసుకుందాం.

మొదటగా చినంగాకు పుదీనా పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. ఈ పచ్చడి కోసం ఒక కప్పు తాజా చినంగాకు మరియు పావు కప్పు పుదీనా ఆకులను తీసుకోవాలి. ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని రెండు చెంచాల ధనియాలు, ఒక టీస్పూన్ జీలకర్ర వేసి డ్రై రోస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ఎనిమిది నుండి పది ఎండుమిర్చి, ఒక టీస్పూన్ మెంతులు , మినపప్పు కూడా వేయించి తీసుకోవాలి. అనంతరం కొద్దిగా ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేయించాలి.

అదే పాత్రలో మరికొద్దిగా ఆయిల్ వేసి శుభ్రం చేసిన చినంగాకు, పుదీనా ఆకులు, పావు టీస్పూన్ పసుపు వేసి ఐదు నుండి ఎనిమిది నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో బాగా మగ్గనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసి, నిమ్మకాయ సైజు నానబెట్టిన చింతపండు, ఉప్పు, ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మరియు కొద్దిగా నీళ్లు పోసి బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చివరగా ఆయిల్ వేడి చేసి ఆవాలు, జీలకర్ర, మినపగుండ్లు, వెల్లుల్లి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు మరియు ఒక టీస్పూన్ నువ్వులు వేసి తాలింపు పెడితే చినంగాకు పచ్చడి సిద్ధం.

ఇక జుట్టు పెరుగుదలకు మరియు డాండ్రఫ్ నివారణకు అద్భుతంగా ఉపయోగపడే కరివేపాకు పచ్చడి తయారీ కోసం 150 గ్రాముల తాజా కరివేపాకును కడిగి ఆరబెట్టుకోవాలి. పాన్ లో ఆయిల్ వేసి ఒక టీస్పూన్ జీలకర్ర, మూడు ఎండుమిర్చి, ఒక టీస్పూన్ మినప్పప్పు, పదిహేను పచ్చిమిర్చి, చింతపండు రేకులు, ఏడు వెల్లుల్లి రెబ్బలు వేసి రెండు నిమిషాలు లో ఫ్లేమ్ లో వేయించి మిక్సీ జార్ లోకి తీసుకోవాలి.

అదే పాన్ లో ఐదు చెంచాల ఆయిల్ వేసి కరివేపాకు, పావు టీస్పూన్ పసుపు వేసి పది నిమిషాల పాటు క్రిస్పీగా అయ్యే వరకు వేయించాలి. ముందుగా వేయించిన దినుసులను ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టి, ఆ తర్వాత వేయించిన కరివేపాకు, అర గ్లాసు నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేయాలి. దీనికి ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, వెల్లుల్లి, పసుపుతో కమ్మటి తాలింపు పెడితే కరివేపాకు పచ్చడి సిద్ధం. ఈ రెండు అద్భుతమైన పచ్చళ్లు వేడివేడి అన్నం, చపాతీ లేదా దోశల్లోకి ఎంతో రుచికరంగా ఉంటాయి. ఈ సాంప్రదాయ ఔషధ వంటకాలను మీ ఇంట్లో తప్పకుండా ప్రయత్నించి మీ కుటుంబ సభ్యులందరి ఆరోగ్యాన్ని పటిష్టంగా కాపాడుకోండి.