
కావలసిన పదార్థాలు: 1 కప్పు బార్లీ గింజలు, అర కప్పు మినపగుళ్లు, 1 టీస్పూన్ మెంతులు, అర కప్పు అటుకులు, 1 కప్పు ఇడ్లీ రవ్వ, రుచికి సరిపడా ఉప్పు, పిండి రుబ్బడానికి నీళ్లు. తయారీ విధానం: ఒక కప్పు బార్లీ గింజలు, అర కప్పు మినపగుళ్లు, ఒక టీస్పూన్ మెంతులను తీసుకుని రెండు సార్లు శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత మంచి నీళ్లు పోసి కనీసం 6 గంటల పాటు లేదా రాత్రంతా నానబెట్టుకోవాలి.

రుబ్బే సమయానికి ముందు అర కప్పు అటుకులను కడిగి రెండు నిమిషాలు నీటిలో నానబెట్టాలి; అలాగే ఒక కప్పు ఇడ్లీ రవ్వను కూడా విడిగా నీటిలో నానబెట్టి ఉంచుకోవాలి. ముందుగా మిక్సీ జార్‌లో నానిన మినపగుళ్లు, మెంతులు వేసి.. ఎక్కువ నీళ్లు పోయకుండా కొద్దికొద్దిగా నీళ్లు చిలకరిస్తూ మెత్తటి నునుపైన పేస్ట్‌లా రుబ్బి బౌల్‌లోకి తీసుకోవాలి.

ఇప్పుడు అదే మిక్సీ జార్‌లో నానిన బార్లీ గింజలు, నానబెట్టిన అటుకులు వేసి కొద్దిగా నీళ్లు చేర్చి స్మూత్‌గా గ్రైండ్ చేయాలి. బార్లీలో ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల కాస్త బరకతనం ఉంటుంది. గ్రైండ్ చేసుకున్న మినప బ్యాటర్, బార్లీ బ్యాటర్‌ను ఒకే గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన ఇడ్లీ రవ్వను చేత్తో నీరు ఏమాత్రం లేకుండా గట్టిగా పిండి ఈ పిండి మిశ్రమంలో వేయాలి. పిండి మొత్తాన్ని చేత్తో ఒకే దిశలో బాగా కలుపుకోవాలి. రాత్రంతా మూతపెట్టి పులియనివ్వాలి; మరుసటి రోజు ఉదయానికి పిండి చక్కగా పొంగి ప్లఫీగా ఫెర్మెంట్ అవుతుంది.

ఫెర్మెంట్ అయిన పిండిలో నుండి కావలసినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి సున్నితంగా కలపాలి. ఇడ్లీ పాత్రలో నీళ్లు పోసి ముందుగానే మరిగించుకోవాలి. ఇడ్లీ ప్లేట్లకు కొద్దిగా నూనె లేదా నెయ్యి రాసి, పిండిని నింపుకుని ఆవిరి పాత్రలో పెట్టాలి. మూతపెట్టి హై-మీడియం మంటపై సాధారణ ఇడ్లీల కంటే 5 నిమిషాలు అదనంగా సుమారు 12 నుండి 15 నిమిషాలు ఆవిరిపై ఉడికించాలి.

ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్‌ను బయటకు తీసి కాసేపు చల్లారనిస్తే ఇడ్లీలు అంటుకోకుండా మల్లెపూవుల్లా విడివడతాయి. అంతే, ఒంటికి చలువ చేసే దూదిలాంటి 'బార్లీ ఇడ్లీ' సిద్ధం! పైన కాస్త నెయ్యి రాసుకుని, కమ్మని వేరుశనగపప్పు చట్నీతో తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతూ అమృతతుల్యంగా ఉంటుంది!