శీతాకాలంతోపాటు అన్ని సీజన్లల్లో దొరికే ఈ పండును సాధారణంగా తిన్నా.. లేక జ్యూస్ చేసుకొని తాగిన అద్భుత ప్రయోజనాలు కలుగుతాయి. అందుకే వీలైనప్పుడల్లా అలాంటి నారింజ పండ్లు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఆరెంజ్ లో బీటా కెరోటిన్, పొటాషియం, మెగ్నీషియం, ఫైబర్‌తోపాటు విటమిన్ సి అధికం. బరువు తగ్గేందుకు సహాయపడటమే కాకుండా రోగనిరోధక శక్తిని బాగా పెంచుతుంది. యాంటీవైరల్, యాంటీమైక్రోబయల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటుంది. వీటిలోని లక్షణాలు అనేక దీర్ఘకాలిక వ్యాధులను నివారించేందుకు సాయపడతాయి.
నారింజలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది బరువు తగ్గడానికి సహాయపడుతుంది. నారింజలో ఉండే ఫైబర్ ఆకలిని అరికట్టి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. దీనివల్ల మీరు ఎక్కువ ఆహారం తీసుకోలేరు. కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి.
చర్మ వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. నారింజలో ఆమ్లాలు, విటమిన్లు, ఖనిజాలు, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్లు అత్యధికంగా ఉంటాయి. అవి మీ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు సాయపడతాయి. వీటిని తినడం ద్వారా చర్మం హైడ్రేట్ గా ఉంటుంది. దీంతోపాటు చర్మానికి సంబంధించిన కొల్లాజెన్ ఉత్పత్తిని కూడా వేగవంతం చేస్తుంది.
కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది.. ఆరెంజ్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. ఆరెంజ్‌లో ఫైబర్ (పెక్టిన్) పుష్కలంగా ఉంటుంది. ఫైబర్ కాలేయానికి సహాయపడుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి బరువు తగ్గేలా చేస్తుంది. నారింజలో అధికంగా ఉండే విటమిన్ సి.. కొలెస్ట్రాల్ స్థాయిలను తక్కువగా ఉంచుతుంది. గుండె జబ్బులను నివారించడంలో సహాయపడుతుంది.