
వేసవి సీజన్ రాగానే మామిడి (Mangos) ప్రియుల ఆనందానికి హద్దులు ఉండవు. వేసవి ప్రారంభం కాగానే పచ్చి మామిడికాయలు మార్కెట్‌లో కనిపించడం మొదలవుతుంది. మామిడిని “పండ్ల రాజు”గా పిలుస్తారు. అందుకే దాని కోసం ఏడాది పొడవునా ఎదురుచూస్తారు. ముఖ్యంగా ఏప్రిల్‌లో పచ్చి మామిడికాయలు విరివిగా లభిస్తాయి. అయితే, పచ్చి మామిడి రుచి మాత్రమే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ప్రతి కాలానికి అనుగుణంగా లభించే ఆహారాలను తినడం మన శరీరానికి చాలా అవసరం. అయితే, ఏ ఆహారమైనా పరిమితంగా తీసుకోవడం మంచిది. పచ్చి మామిడి పోషక విలువలు పచ్చి మామిడికాయలు విటమిన్ A, విటమిన్ C, విటమిన్ E, కాల్షియం, ఐరన్, ఫైబర్, మెగ్నీషియం, ఫాస్ఫరస్ వంటి అనేక పోషకాలతో నిండి ఉంటాయి. ఇవి శరీరాన్ని వేసవి వేడికి నుంచి రక్షించి, రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

ముఖ్యమైన ప్రయోజనాలు.. 1. నిర్జలీకరణం నివారణ.. పచ్చి మామిడి శరీరంలో నీటి లోటును పూడ్చడంలో సహాయపడుతుంది. వడదెబ్బ నుంచి రక్షించి, శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అలాగే ఎలక్ట్రోలైట్ సమతుల్యతను కాపాడుతుంది.

2. జీర్ణక్రియ మెరుగుదల.. ఇందులో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం, గ్యాస్, అజీర్ణం, ఎసిడిటీ వంటి సమస్యలను తగ్గిస్తుంది.

3. రోగనిరోధక శక్తి పెంపు.. విటమిన్ C సమృద్ధిగా ఉండడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. వేసవిలో వచ్చే వ్యాధులను దూరం చేస్తుంది.

4. బరువు నియంత్రణ.. పండిన మామిడితో పోలిస్తే పచ్చి మామిడిలో చక్కెర, కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇది మెటాబాలిజాన్ని పెంచి బరువు తగ్గడంలో సహాయపడుతుంది.

5. కాలేయం, దంతాల ఆరోగ్యం.. కాలేయాన్ని శుభ్రపరచడంలో సహాయపడుతుంది. అలాగే చిగుళ్ల నుంచి రక్తస్రావం, నోటి దుర్వాసన వంటి సమస్యలను తగ్గిస్తుంది. జాగ్రత్తలు: పచ్చి మామిడికాయలు ఆరోగ్యానికి మంచివే అయినప్పటికీ, వాటిని పరిమితంగా మాత్రమే తినాలి. ఎక్కువగా తింటే కడుపు నొప్పి, గొంతు నొప్పి వంటి సమస్యలు రావచ్చు. నెయ్యి లేదా కొద్దిగా ఉప్పుతో తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుంది. మొత్తంగా, పచ్చి మామిడి వేసవిలో శరీరానికి సహజమైన శక్తిని అందించే ఒక అద్భుతమైన ఆహారం.