
మన శారీరక ఆరోగ్యానికి పండ్లు చాలా ముఖ్యం. ముఖ్యంగా ఉదయం అల్పాహారంతో పాటు పండ్లు తీసుకుంటే రోజంతా కావలసిన శక్తి లభిస్తుంది. అయితే ఉదయం పూట ఏ పండు తింటే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయనే గందరగోళం చాలా మందిలో ఉంటుంది. మనకు సులభంగా దొరికే జామపండు, అరటిపండులలో దేని ప్రత్యేకతలు దానివే.

జామపండును ఒక అద్భుతమైన సూపర్‌ఫుడ్‌గా చెప్పవచ్చు. ఇందులో నారింజ కంటే నాలుగు రెట్లు ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది, ఇది శరీర రోగనిరోధక శక్తిని రోజంతా బలోపేతం చేస్తుంది. అలాగే ఇందులో కేలరీలు తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక చక్కటి ఎంపిక.

అరటి పండు: మరోవైపు అరటిపండు తక్షణ శక్తికి మారుపేరు. ఇందులో ఉండే సహజ చక్కెరలు, కార్బోహైడ్రేట్లు శరీరానికి వెంటనే నూతన ఉత్తేజాన్ని ఇస్తాయి. అందుకే ఉదయాన్నే జిమ్‌కి వెళ్లేవారికి లేదా శారీరక శ్రమ చేసేవారికి ప్రీ-వర్కవుట్ ఆహారంగా అరటిపండు అత్యంత ప్రయోజనకరంగా ఉంటుంది.

పోషకాల పరంగా చూస్తే అరటిపండులోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తూ గుండె ఆరోగ్యానికి, కండరాల పనితీరుకు తోడ్పడుతుంది. అలాగే ఇందులోని విటమిన్ బి6 మెదడును చురుకుగా ఉంచి, ఒత్తిడిని తగ్గిస్తుంది. జామపండులోని గుణాలు రక్తపోటును తగ్గించడంతో పాటు మధుమేహాన్ని అదుపులో ఉంచడానికి సహాయపడతాయి.

ఏది బెస్ట్: మీ ఆరోగ్య లక్ష్యాన్ని బట్టి వీటిని ఎంచుకోవాలి. మీరు బరువు తగ్గడం, మంచి జీర్ణక్రియ, కడుపు నిండిన అనుభూతిని కోరుకుంటే జామపండు బెస్ట్. అలా కాకుండా ఉదయాన్నే చురుకుదనం, తక్షణ శక్తి కావాలనుకుంటే అరటిపండు సరైన ఎంపిక. ఈ రెండింటినీ మార్చి మార్చి డైట్‌లో చేర్చుకోవడం వల్ల సంపూర్ణ ఆరోగ్యం లభిస్తుంది.