
కావలసిన పదార్థాలు: 8 మీడియం సైజు గోంగూర కట్టలు, 200 గ్రాముల పచ్చిమిరపకాయలు, ముప్పావు కప్పు వంట నూనె , 1 టీస్పూన్ మెంతులు, 1 టీస్పూన్ జీలకర్ర, 1 టీస్పూన్ ఆవాలు, 15 నుండి 20 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ ఇంగువ, అర టీస్పూన్ పసుపు, రుచికి సరిపడా ఉప్పు

తయారీ విధానం: 8 కట్టల గోంగూరను నీటిలో శుభ్రంగా కడిగి కాటన్ క్లాత్‌పై వేసి ఫ్యాన్ కింద తడి ఏమాత్రం లేకుండా పూర్తిగా ఆరబెట్టాలి. ఆరిన తర్వాత ఆకులను కాస్త చిన్నగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. నూనెలో వేసినప్పుడు ఆకులు ఆకులుగా ఉండకుండా చక్కగా మగ్గుతాయి. 200 గ్రాముల పచ్చిమిరపకాయలను తుంపి మిక్సీ జార్‌లో వేసి.. మెత్తటి పేస్ట్‌లా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి పక్కన ఉంచుకోవాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి ఒక టీస్పూన్ మెంతులు, ఒక టీస్పూన్ జీలకర్ర, ఒక టీస్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్‌పై మాడిపోకుండా దోరగా వేయించాలి. మెంతులు ఎర్రగా వేగిన తర్వాత చల్లార్చి మిక్సీలో మెత్తటి పొడిలా చేసి పెట్టుకోవాలి.అదే పాన్‌లో ముప్పావు కప్పు నూనె పోసి వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత అర టీస్పూన్ ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర వేసి చిటపటలాడనివ్వాలి. ఇప్పుడు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న పచ్చిమిర్చి ముద్దను వేసి లో-మీడియం మంటపై పచ్చివాసన పోయేలా 2 నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత దంచిన 15-20 వెల్లుల్లి రెబ్బలు, పావు టీస్పూన్ ఇంగువ వేసి పచ్చిమిర్చి రంగు మారే వరకు సన్నటి సెగపై బాగా వేయించాలి.

పచ్చిమిర్చి వేగిన తర్వాత అర టీస్పూన్ పసుపు, కట్ చేసి ఉంచుకున్న గోంగూర మొత్తాన్ని వేసి కలపాలి. నీళ్లు చుక్క కూడా పోయకుండా.. మంటను లో ఫ్లేమ్‌లో ఉంచి మూతపెట్టాలి; గోంగూరలోని సహజ తేమతోనే నూనెలో మగ్గిపోతుంది. మధ్యమధ్యలో కలుపుతూ 3 టీస్పూన్ల ఉప్పు వేసి మళ్లీ మూతపెట్టాలి. సుమారు 15 నిమిషాల పాటు సన్నటి సెగపై గోంగూర గుజ్జులా మారి నూనె పైకి తేలే వరకు మగ్గించాలి.ఎక్కువగా డ్రైగా అనిపిస్తే కొద్దిగా మరిగించిన వేడి నీళ్లను మాత్రమే పోసి మగ్గించవచ్చు.

నూనె తేలిన తర్వాత ముందుగా చేసి పెట్టుకున్న మెంతి పొడిలోంచి 1 టీస్పూన్ పొడి వేసి కలిపి.. మూతపెట్టి మరొక్క నిమిషం మగ్గించి స్టవ్ ఆఫ్ చేయాలి. పూర్తిగా చల్లారిన తర్వాత తడి లేని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. అంతే, పుల్లపుల్లగా కారంగా ఉండే 'గోంగూర పచ్చిమిర్చి నిల్వ పచ్చడి' సిద్ధం! వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని, పక్కన ఆమ్లెట్ నంజుకుని తింటుంటే మాటల్లో చెప్పలేనంత కమ్మటి అనుభూతి కలుగుతుంది!