
పసిడి ప్రియులకు బంగారం ధరలు మళ్లీ షాక్ ఇచ్చాయి. గత రెండు మూడు రోజుల్లో ఏ స్థాయిలో దిగొచ్చాయో, ఇప్పుడు మళ్లీ అదే స్థాయిలో పైకి ఎగబాకాయి. బుధవారంతో పోల్చుకుంటే గురువారం బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఒక్క రోజులోనే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.2,610 పెరిగింది. దీంతో దేశీయ మార్కెట్‌లో బంగారం ధర రూ.1,25,890 వద్ద ట్రేడవుతోంది.

ఇక ఈ భారీ మార్పుల తర్వాత హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,25,890 గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,400 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికి వస్తే, ఇది కొనుగోలుదారులకు కాస్త ఊరట కల్పిస్తూ స్థిరంగానే కొనసాగుతోంది. ప్రస్తుతం దేశీయ మార్కెట్‌లో కేజీ వెండి ధర రూ.1,65,000 వద్ద ట్రేడవుతోంది.

విశాఖపట్నం, విజయవాడలోనూ తులం (24 క్యారెట్ల) బంగారం ధర రూ.1,25,890 గా ఉండగా.. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,15,400 వద్ద ట్రేడవుతోంది. అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబై, పుణె, బెంగళూరు, చెన్నైలోనూ ఇదే రేట్లు కొనసాగుతున్నాయి. కానీ దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం తులం బంగారం ధర రూ.1,26,040 వద్ద ట్రేడవుతోంది.

అంతర్జాతీయ కమోడిటీ మార్కెట్లో బుధవారం కనిష్ఠ స్థాయిలను తాకిన తర్వాత పసిడి ధరలు కొంత స్థిరపడి, తిరిగి స్వల్పంగా పుంజుకున్నాయి. దీని ప్రభావంతో భారత ఎంసీఎక్స్ (MCX), రిటైల్ మార్కెట్లలో బంగారం ధరలు భారీగా పెరిగాయని విశ్లేషకులు చెబుతున్నారు. దీనికి తోడు ఇటీవల బంగారం ధరలు తగ్గడంతో కొనుగోళ్లు కూడా పెరిగాయి. దీంతో డిమాండ్ పెరిగి ధరలు కూడా కాస్త పుంజుకున్నాయి.

అయితే డిసెంబర్‌లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను పెంచే అవకాశాలు ఉన్నందున, బంగారం ధరలు మళ్లీ తగ్గే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ పెరుగుదల కేవలం సాంకేతిక రికవరీ మాత్రమేనని, మార్కెట్లో ఒడిదుడుకులు కొనసాగవచ్చని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందుకే బంగారం కొనాలనుకునే వారు ఒక నెల రోజుల పాటు ఆగితే మంచిదని సూచిస్తున్నారు.