
బ్యాంకులు వర్సెస్ ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు : ఒక వేళ మీరు గోల్డ్ లోన్ తీసుకోవాలని అనుకుంటే ముందుగా ఎక్కడ వడ్డీ రేటు తక్కువగా ఉందో తెలుసుకోవడం చాలా ముఖ్యం. బ్యాంకులలో బంగారు రుణాలపై వడ్డీ రేటు కొద్దిగా తక్కువగా ఉంటుంది. కానీ ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలు అధిక వడ్డీ రేట్లను వసూలు చేస్తాయి. ఆర్థిక సంస్థలలో రుణ మొత్తం త్వరగా మంజూరైనప్పటికీ, మీరు తక్కువ వడ్డీ రేట్ల ప్రయోజనాన్ని పొందాలనుకుంటే బ్యాంకులను సంప్రదించడం మంచిది.

తిరిగి చెల్లించే కాలపరిమితి: మీరు తీసుకున్న రుణాన్ని నిర్ణీత కాలంలోగా తిరిగి చెల్లించకపోతే, సదరు సంస్థ మీ బంగారాన్ని వేలం వేసే అవకాశం ఉంది. బ్యాంకులు సాధారణంగా 3 నెలల నుండి 3 సంవత్సరాల వరకు కాలపరిమితిని ఇస్తాయి. కాబట్టి, మీ ఆర్థిక పరిస్థితిని బట్టి సరైన కాలపరిమితిని ఎంచుకోవడం మంచిది.

బంగారం ధరల్లో హెచ్చుతగ్గులు: మీరు తాకట్టు పెట్టే బంగారం ప్రస్తుత మార్కెట్ ధర ఆధారంగా మీకు రుణం లభిస్తుంది. అయితే, రుణం తీసుకున్న తర్వాత మార్కెట్లో బంగారం ధరలు అకస్మాత్తుగా భారీగా తగ్గితే, అదనపు బంగారాన్ని తాకట్టు పెట్టమని లేదా కొంత నగదు చెల్లించమని బ్యాంకులు అడిగే అవకాశం ఉంటుంది. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.

సులభమైన నిబంధనలు: పర్సనల్ లోన్ లేదా ప్రాపర్టీ లోన్‌తో పోలిస్తే బంగారు రుణ నిబంధనలు చాలా సులభం. ఎందుకంటే ఇక్కడ మీ బంగారం హామీగా ఉంటుంది. దీనివల్ల బ్యాంకులు ఎటువంటి రిస్క్ లేకుండా త్వరగా రుణాన్ని మంజూరు చేస్తాయి.

సిబిల్ స్కోర్: గోల్డ్ లోన్ తీసుకునే వారకి బెనిఫిట్ ఏమిటంటే..మీకు సిబిల్ స్కోర్ అవసరం లేకుండానే గోల్డ్ లోన్ ఇస్తారు. ఎందుకంటే ఇక్కడ మీ సిబిల్ స్కోర్ ఇక్కడ పరిగణనలోకి తీసుకోరు. మీరు ఇచ్చే బంగారం బరువు, నాణ్యత ఆధారంగానే మీకు లోన్ ఇస్తారు. అందుకే అత్యవసర పరిస్థితుల్లో ఎటువంటి ఇబ్బంది లేకుండా నిమిషాల వ్యవధిలోనే డబ్బు మీ చేతికి రావాలంటే గోల్డ్ ఓ మంచి మార్గం.