
పొద్దున్నే ఒక గిన్నె గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం తింటే శరీరానికి కావాల్సిన పోషకాలు లభిస్తాయి. గోధుమ రవ్వలోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరచగా, పూల్ మఖానాలోని ప్రోటీన్లు, కాల్షియం, మెగ్నీషియం శక్తిని అందిస్తాయి. పాలు, డ్రైఫ్రూట్స్, బెల్లం కలయికతో తయారయ్యే ఈ పాయసం ఆరోగ్యకరమైన అల్పాహారంగా ఉపయోగపడుతుంది. రుచికరంగా ఉండటమే కాకుండా, రోజంతా ఉత్సాహంగా ఉండేందుకు తోడ్పడుతుంది.

గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం తయారీకి.. గోధుమ రవ్వ (Broken Wheat) – ½ కప్పు, పూల్ మఖానా (Fox Nuts) – 1 కప్పు, పాలు – 750 మి.లీ., బెల్లం పొడి – ¾ కప్పు (లేదా రుచికి సరిపడా), నెయ్యి – 2 టేబుల్ స్పూన్లు, జీడిపప్పు – 10, బాదంపప్పు – 8–10 (రాత్రంతా నానబెట్టినవి), గసగసాలు- ఒక స్పూన్ (రాత్రంతా నానబెట్టినవి), పిస్తా – కొద్దిగా (ఐచ్ఛికం), యాలకుల పొడి – ½ టీ స్పూన్, కుంకుమపువ్వు – కొద్దిగా (ఐచ్ఛికం) తీసుకోవాలి.

పాన్‌లో ఒక స్పూన్ నెయ్యి వేసి పూల్ మఖానాను 3–4 నిమిషాలు వేయించాలి. చల్లారిన తర్వాత సగం మఖానాను మిక్సీలో కొద్దిగా పొడి చేసుకోవాలి. మిగిలినవి అలాగే ఉంచాలి. మరో పాన్‌లో గోధుమ రవ్వను నెయ్యిలో 2–3 నిమిషాలు స్వల్పంగా వేయించాలి. అవసరమైనంత పాలతో రవ్వను మెత్తగా ఉడికించాలి. ఆ తర్వాత పాలు పోసి 5–7 నిమిషాలు మరిగించాలి.

ఆ తర్వాత తొక్కతీసిన బాదంపప్పు, గసగసాలను పాలతో గ్రైండ్ చేసుకుని, ఆ మిశ్రమాన్ని ఉడికించిన మిశ్రమంలో కలపాలి. తీపికోసం బెల్లం వేయాలి. మఖానా పొడి, మిగిలిన మఖానా వేసి బాగా కలపాలి. పాలు మాడిపోకుండా మంట తక్కువగా ఉంచాలి. చివరగా యాలకుల పొడి, నెయ్యిలో వేయించిన జీడిపప్పు, బాదం, పిస్తా వేసి కలిపి దించాలి. అంతే టేస్టీ గోధుమ రవ్వ – పూల్ మఖానా పాయసం రెడీ అయినట్లే.

గోధుమ రవ్వలో ఫైబర్ ఉండటం వల్ల జీర్ణక్రియకు సహాయపడుతుంది. పూల్ మఖానాలో ప్రోటీన్, కాల్షియం, మెగ్నీషియం వంటి పోషకాలు ఒంటికి శక్తిని ఇస్తాయి. ఇందులో పాలు, డ్రై ఫ్రూట్స్ కలవడంతో ఇది పోషకాహారంగా ఉంటుంది.