
కావలసిన పదార్థాలు: 1 కప్పు గోధుమ రవ్వ, 1 కప్పు తురిమిన బెల్లం, 4 కప్పులు నీళ్లు, 4 నుండి 5 టేబుల్ స్పూన్ల స్వచ్ఛమైన నెయ్యి, 2 టేబుల్ స్పూన్ల జీడిపప్పు & బాదం పలుకులు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, గుప్పెడు ఫూల్ మఖానా, అర టీస్పూన్ యాలకుల పొడి

తయారీ విధానం: స్టవ్‌పై కుక్కర్ పెట్టి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి వేడిచేయాలి. నెయ్యి కాగిన తర్వాత జీడిపప్పు, బాదం పలుకులు వేసి వేయించాలి. అవి సగం వేగాక సన్నగా తరిగిన ఎండు కొబ్బరి ముక్కలు, గుప్పెడు ఫూల్ మఖానా వేసి మరో రెండు నిమిషాలు దోరగా వేయించి ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కుక్కర్లో మరో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో 1 కప్పు గోధుమ రవ్వను వేయాలి.

మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో కలుపుతూ రవ్వ మంచి గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారి కమ్మటి సువాసన వచ్చే వరకు సుమారు 10 నిమిషాలు వేయించాలి. రవ్వ చక్కగా వేగిన తర్వాత సరిగ్గా 3 కప్పుల నీళ్లు పోసి కలపాలి. కుక్కర్ మూతకు రబ్బర్, విజిల్ పెట్టి మీడియం మంటపై సరిగ్గా 3 విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. రవ్వ ఉడికేలోగా.. పక్క స్టవ్‌పై గిన్నె పెట్టి 1 కప్పు తురిమిన బెల్లం, 1 కప్పు నీళ్లు పోయాలి. బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత 1 నిమిషం పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసి పక్కన ఉంచుకోవాలి తీగ పాకం అవసరం లేదు.

కుక్కర్లోని ఆవిరి పూర్తిగా పోయిన తర్వాత మూత తీసి చూడాలి. రవ్వను వేలితో నొక్కి చూస్తే మెత్తగా ఉడికి ఉండాలి. ఇప్పుడు కరిగించిన బెల్లం నీటిని టీ జల్లెడతో వడకడుతూ కుక్కర్లోకి పోయాలి. స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై రవ్వ బెల్లం పాకాన్ని పీల్చుకునేలా కలుపుతూ ఉడికించాలి. ఉడుకుతున్న సమయంలో మధ్యమధ్యలో 3 సార్లు ఒక్కో టేబుల్ స్పూన్ చొప్పున నెయ్యి వేస్తూ కలపాలి. హల్వాలోని నీరంతా ఇంకిపోయి, పాన్ అంచుల నుండి నెయ్యి వదులుతూ ముద్దలా దగ్గరపడేంత వరకు ఉడికించాలి.

హల్వా చక్కగా దగ్గరపడ్డాక.. ముందుగా వేయించి పెట్టుకున్న జీడిపప్పు, బాదం, కొబ్బరి, ఫూల్ మఖానా పలుకులను వేయాలి. చివరగా అర టీస్పూన్ యాలకుల పొడి వేసి అంతా కలిసేలా ఒక్కసారి బాగా తిప్పి వెంటనే స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మటి 'గోధుమ రవ్వ హల్వా' సిద్ధం! ప్లేట్లో పెట్టి స్పూన్‌తో తుంచుతుంటే జెల్లీలా సాఫ్ట్‌గా ఉంటూ, నోట్లో వేస్తే నేతి పరిమళం, బెల్లం కమ్మదనంతో వెన్నలా కరిగిపోతూ అతిథులను అమితంగా మెప్పిస్తుంది!