
కావాల్సిన పదార్థాలు : పచ్చి కొబ్బరి, పెసరపప్పు: అర కప్పు, నీళ్లు: రెండు కప్పులు (పప్పు నానబెట్టడానికి), నూనె: మూడు-నాలుగు టేబుల్ స్పూన్లు, మెంతులు: కొంచం , ఆవాలు: అర టీ స్పూన్, జీలకర్ర: పావు టీ స్పూన్, ఉల్లిపాయ: ఒకటి (చిన్న ముక్కలుగా), పచ్చిమిర్చి: ఒకటి లేదా రెండు (రుచికి తగ్గట్టు) కరివేపాకు: మూడు రెమ్మలు, ఎండుమిర్చి: రెండు, పొట్టు తీసిన వెల్లుల్లి రెబ్బలు, పసుపు: చిటికెడు, ఇంగువ: మూడు-నాలుగు పఫ్స్ పచ్చి కొబ్బరి తురుము: ముప్పావు కప్పు, కారం: అర టీ స్పూన్ (లేదా రుచికి సరిపడా), ఉప్పు: అర టీ స్పూన్ , కొత్తిమీర: సన్నగా తరిగినది తీసుకోవాలి.

ముందుగా స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, అర కప్పు పెసరపప్పు వేసి మీడియం ఫ్లేమ్‌లో కలుపుకుంటూ కొద్దిగా రంగు మారే వరకు వేయించుకోవాలి. పప్పు వేయించడం వల్ల కూరకు మంచి రుచి వస్తుంది. రంగు మారిన తర్వాత, పప్పును ఒక గిన్నెలోకి తీసి, నీళ్లు పోసి ఒకటి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. కడిగిన పప్పులో రెండు కప్పుల నీళ్లు పోసి, కనీసం అరగంట పాటు నానబెట్టాలి.

ఇంకా మీరు కూర కోసం పోపును సిద్ధం చేసుకోవాలి. స్టవ్ పైన ఒక గిన్నె పెట్టి, మూడు నాలుగు టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె కాగిన తర్వాత కొన్ని మెంతులు, అర టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి. మెంతులు ఎక్కువ వేయకుండా జాగ్రత్తపడాలి.

పోపు గింజలు వేగిన తర్వాత, చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి వేసి ఉల్లిపాయలు కొంచెం రంగు మారే వరకు వేయించుకోవాలి. మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడు పొట్టు తీసిన 7-10 వెల్లుల్లి రెబ్బలను వేసి కొద్దిసేపు వేయించాలి. ఆ తర్వాత కొంచెం పసుపు, మూడు నాలుగు పఫ్స్ ఇంగువ వేసి బాగా కలపాలి. ఇంగువ వేయడం వల్ల కూరకు మంచి రుచి రావడమే కాకుండా జీర్ణశక్తికి కూడా సహాయపడుతుంది.

పసుపు, ఇంగువ బాగా కలిసిన తర్వాత, ముప్పావు కప్పు పచ్చి కొబ్బరి తురుము వేసి, కొబ్బరి కమ్మటి వాసన వచ్చేవరకు వేయించుకోవాలి.కొబ్బరి బాగా వేగిన తర్వాత, మనం ముందుగా నానబెట్టుకున్న పెసరపప్పును నీళ్లతో సహా వేసేయాలి. పోసేటప్పుడు చేతికి ఆవిరి తగలకుండా జాగ్రత్త వహించాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపి, మూత పెట్టి తక్కువ మంటపై ఉడికించాలి. మూతను పూర్తిగా మూయకుండా కొంచెం పక్కకు పెడితే పొంగిపోకుండా ఉంటుంది. మధ్యమధ్యలో కలుపుకుంటూ అడుగంటకుండా చూసుకోవాలి. పెసరపప్పును కుక్కర్‌లో ఉడికించకూడదు, అలా చేస్తే ముద్దగా మారిపోతుంది. నీళ్లన్నీ ఆవిరైపోయి పప్పు మెత్తగా ఉడికిన తర్వాత, రుచికి సరిపడినంత కారం, ఉప్పు వేసి బాగా కలపాలి. చివరగా సన్నగా తరిగిన కొత్తిమీర వేసి మరోసారి కలిపి, మూత పెట్టి రెండు నిమిషాలు ఉడికించి స్టవ్ ఆఫ్ చేయాలి.