
ఈ భూమిపై జన్మించే ఏ ఒక్కరి వ్యక్తిత్వం ఒకేలా ఉండదు.. ఒక్కొక్కరి స్వభావం ఒక్కోలా ఉంటుంది. అలాగే వారి శరీర నిర్మాణం, అభిరుచులు, అలవాట్లు కూడా భిన్నంగా ఉంటాయి. వారు మాట్లాడే తీరు, నిలబడే, కూర్చునే విధానంలోనూ అనేక తేడాలు ఉంటాయి. ఇవన్నీ ఆ వ్యక్తి వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయంటే మీరు నమ్ముతారా? అవును, కొన్ని అధ్యయనాల ప్రకారం.. ఒక వ్యక్తి పిడికిలిని ఎలా బిగిస్తాడనే విధానాన్ని బట్టి అతను ఎలాంటి వాడో చెప్పేయొచ్చట.

చూపుడు వేలిపై బొటనవేలు: ఒక్కో వ్యక్తి ఒక్కోలా తమ పిడికిలిని బిగిస్తుంటారు. అందులో కొందరు చూపుడు వేలిపై బొటనవేలు ఉండేలా పిడికిలిని బిగిస్తారు. ఇలాంటి వ్యక్తులు పుట్టుకతోనే నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారట. వీరు ఎల్లప్పుడూ తాము అనుకున్న లక్ష్యాలను సాధించేందుకు నిరంతరం శ్రమిస్తుంటారు. ఏదైనా లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే దాన్ని సాధించే వరకు విశ్రమించరు. ఇతరులకు ఎల్లప్పుడూ మార్గదర్శకంగా నిలుస్తారు. అలాగే వీరికి సానుభూతి, కరుణ, కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి, ఆత్మనియంత్రణ, మంచి జ్ఞాపకశక్తి, మానసిక పరిపక్వత, చక్కని సంభాషణా నైపుణ్యం ఉంటాయట.

వేళ్లపై బొటనవేలు: కొంతమంది నాలుగు వేళ్లపై బొటనవేలు ఉండేలా పిడికిలిని బిగిస్తారు. ఇలాంటి వ్యక్తులు ఎప్పుడూ వినూత్నంగా, అందరికంటే భిన్నంగా ఆలోచిస్తారు. అలాగే వీరికి ఆత్మగౌరవం (సెల్ఫ్ రెస్పెక్ట్) చాలా ఎక్కువ. అంతేకాదు, వీరి ఆకర్షణీయమైన వ్యక్తిత్వానికి అందరూ ఫిదా అవుతారు. వీరు నిత్యం నిజాయితీగా ఉంటారు. ఎంతటి ప్రతికూల పరిస్థితులనైనా సైతం తమకు అనుకూలంగా మార్చుకునే నేర్పు వీరి సొంతం.

వేళ్ల కింద బొటనవేలు ఉంచి పిడికిలి బిగించేవారు: ఇలాంటి వ్యక్తులు ఎక్కువగా అంతర్ముఖులుగా (ఇంట్రోవర్ట్) ఉంటారు. వీరు తమ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోవడానికి పెద్దగా ఇష్టపడరు. ఎవరైతే తమ మాటలకు విలువనిచ్చి గౌరవిస్తారో, అలాంటి వారితో మాత్రమే సాన్నిహిత్యంగా ఉండేందుకు ఇష్టపడతారు. ఎదుటివారు రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తూ వారిని శాంతింపజేయడం వీరిలోని ప్రత్యేక లక్షణం. ఈ గుణమే వీరిని ఇతరులకు ప్రత్యేకంగా కనిపించేలా చేస్తుంది.

ముఖ్యంగా సానుకూల దృక్పథం, నిజాయితీ, ఆత్మవిశ్వాసం, సహనం, జిజ్ఞాస, విశాల దృక్పథం, స్థిరమైన వైఖరి వంటి లక్షణాలే వీరిని నలుగురిలో ప్రత్యేకంగా నిలబెడతాయి. కాబట్టి మీరు పిడికిలిని ఎలా బిగిస్తారో గమనించి, మీ స్వభావం ఎలాంటిదో ఈ వ్యక్తిత్వ పరీక్ష ద్వారా తెలుసుకోవచ్చు.Note: పైన పేర్కొన్న అంశాలు కేవలం ఇంటర్నెట్ సమాచారం, నివేదికల ఆధారంగా మాత్రమే అందించబడ్డాయి. వీటిని టీవీ9 ధ్రువీకరించడం లేదు. వీటిపై సందేహాలుంటే నిపుణులను సంప్రదించవచ్చు.