ఉదయం నిద్రలేవగానే కొన్ని కొన్ని తప్పులు చేస్తుంటాం. దీనివల్ల వాటి ప్రభావం మన దైనందిన జీవితంపై తీవ్రంగా పడుతుంది. దీంతో మన పని నాణ్యత తగ్గడానికి కారణంగా మారుతుంది. మరి సాధారణంగా ఉదయం నిద్రలేవగానే మనం చేసే తప్పులేమిటి..? వాటి వల్ల జరిగే నష్టాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం
నిద్రలేవగానే గబగబా పనులు మొదలు పెట్టకూడదు. మొదట కాసేపు కాళ్లు, చేతులు కదిపిస్తూ వామప్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నిద్ర మత్తు పోవడంతో పాటు శరీరానికి కాస్త ఉపశమనంగా కూడా ఉంటుంది. బెడ్ దిగగానే అదరబాదరగా వెళితే నిద్ర మత్తులో తూలి పడే ప్రమాదం ఉంటుంది.
ఉదయం లేచిన తర్వాత కచ్చితంగా కనీసం 20 నిమిషాలైనా యోగా, వ్యాయామం వంటివి చేయాలి. ఇలా చేయడం వల్ల రోజంతా ప్రశాంతంగా ఉండగలరు. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది ప్రతీ రోజూ ఒకే సమయానికి లేవడాన్ని అలవాటు చేసుకోవాలి. పని ఉన్నా లేకున్నా రోజూ ఒకే సమయానికి లేచేలా ప్లాన్ చేసుకుని నిద్రపోవాలి.
ఉదయం నిద్ర లేవగానే చాలా మంది బెడ్ కాఫీ లేదా టీ తాగుతుంటారు. దీనిని ఒక స్టేటస్ సింబల్‌గా కూడా భావిస్తుంటారు. అయితే రాత్రంతా ఎలాంటి ఆహారం తీసుకోకుండా ఉన్న కారణంగా కడుపంతా ఖాళీగా అవుతుంది. ఇలాంటి సమయంలో కాఫీ, టీ తాగితే జీర్ణ వ్యవస్థపై దుష్ప్రభావం పడుతుంది. ఫలితంగా అసిడిటీ వంటి సమస్యలు ఎదురయ్యే అవకాశాలు ఉంటాయి.
నిద్ర నుంచి మేలుకోగానే దాదాపు అందరూ చేసే పని పక్కన ఉన్న స్మార్ట్ ఫోన్ తీసి చెక్ చేయడం. కానీ ఇది మంచి అలవాటు కాదు. ముఖ్యంగా ఉదయం లేవగానే చూడకూడని, చదవకూడని ఏదైనా విషయం మన కంటపడిందంటే రోజంతా డిస్టర్బ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాగే ఉదయం లేవగానే చీకట్లో కళ్లపై ఫోన్ వెలుతురు పడడం కూడా అంత మంచిదికాదు.