
కడుపు ఉబ్బరం, గ్యాస్ సమస్యలు: జామపండులో పీచు పదార్థం, ఫ్రక్టోజ్ అధికంగా ఉంటాయి. మన శరీరం ఒకేసారి ఎక్కువ మొత్తంలో ఫ్రక్టోజ్‌ను జీర్ణం చేసుకోవడం కష్టం. దీనివల్ల పొట్టలో గ్యాస్ తయారవ్వడం, కడుపు ఉబ్బరం, జీర్ణ సమస్యలు ఏర్పడతాయి.

కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ఇబ్బంది: జామపండులో పొటాషియం, విటమిన్ C స్థాయిలు ఎక్కువగా ఉంటాయి. కిడ్నీ సమస్యలు లేదా కిడ్నీలో రాళ్లు ఉన్నవారు పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని పరిమితంగా తీసుకోవాలి. జామ గింజలు జీర్ణం కావడం కాస్త కష్టం కాబట్టి కిడ్నీ రోగులు వైద్యుల సలహా మేరకు మాత్రమే తినాలి.

రక్తంలో చక్కెర స్థాయిలపై ప్రభావం: పండుగా ఉన్న జామపండు గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగానే ఉన్నప్పటికీ, మితిమీరి తింటే అందులోని సహజ చక్కెరల వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలలో మార్పులు రావచ్చు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు రోజుకు ఒక చిన్న జామపండు కంటే ఎక్కువ తినకూడదు.

పంటి నొప్పులు, సున్నితత్వం: దంత సమస్యలు లేదా చిగుళ్ల నొప్పులు ఉన్నవారు గట్టిగా ఉండే పచ్చి జామకాయలను నమిలినప్పుడు పంటి నొప్పులు ఎక్కువయ్యే అవకాశం ఉంది. అలాగే జామ గింజలు పండ్ల సందుల్లో ఇరుక్కుని అసౌకర్యాన్ని కలిగిస్తాయి.

విరేచనాలు: జామపండ్లలో విటమిన్ సి, నీటి శాతం ఎక్కువగా ఉంటుంది. ఒకేసారి 3-4 జామపండ్లను తింటే, శరీరంలో ఫైబర్ పరిమాణం పెరిగి లూజ్ మోషన్స్ లేదా విరేచనాలకు దారితీయవచ్చు. ఏదైనా పండును పరిమితంగా తిన్నప్పుడే దాని పూర్తి పోషకాలు శరీరానికి అందుతాయి. రోజుకు ఒకటి లేదా రెండు జామపండ్లను ఉదయం లేదా మధ్యాహ్నం సమయంలో తినడం సురక్షితం. రాత్రి వేళల్లో మరియు ఖాళీ కడుపుతో తినకపోవడమే మంచిది.