
ముందుగా టీ పొడి లేదా టీ బ్యాగ్‌ను ఎక్కువసేపు మరిగించడం వల్ల అందులో కెఫీన్, టానిన్లు అధికంగా విడుదలవుతాయి. ఇది కడుపులో అసౌకర్యం, యాసిడిటీని పెంచుతుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల వికారం, గ్యాస్, కడుపులో మంట, యాసిడిటీ వంటి తీవ్ర జీర్ణ సమస్యలు తలెత్తుతాయి.

రోజువారీ టీలో చక్కెర ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో క్యాలరీలు పెరిగిపోతాయి. ఇది దీర్ఘకాలంలో బరువు పెరగడానికి, మెటబాలిజం దెబ్బతినడానికి కారణమవుతుంది. అంతేకాదు..ఎక్కువ పాలు, ముఖ్యంగా హెవీ క్రీమ్ మిల్క్‌తో చేసే టీ కొందరిలో కడుపు ఉబ్బరం, భారంగా అనిపించేలా చేస్తుంది. లాక్టోస్ పడని వారికి ఇది మరింత అసౌకర్యాన్ని కలిగిస్తుంది.

ఆహారం తిన్న వెంటనే లేదా భోజనంతో పాటు టీ తీసుకుంటే.. శరీరంలో ఐరన్ శోషణ వేగం తగ్గుతుంది. ఐరన్ లోపం ఉన్నవారు ఈ పొరపాటు అస్సలు చేయకూడదు. అలాగే, రోజుకు ఎక్కువ కప్పుల టీ తాగడం వల్ల శరీరంలోకి కెఫీన్ పరిమాణం పెరుగుతుంది. దీనివల్ల నిద్రలేమి, గుండె దడ, ఆందోళన వంటి సమస్యలు వస్తాయి.

దప్పిక వేసినప్పుడు లేదా ద్రవ అవసరాల కోసం నీటికి ప్రత్యామ్నాయంగా టీని భావించడం సరైంది కాదు. మంచి నీటి స్థానాన్ని టీ భర్తీ చేయలేదు. కాబట్టి, టీ ఆరోగ్యకరమైనదే అయినప్పటికీ, దానిని ఎంత తాగాలి, ఎప్పుడు తాగాలి అనే దానిపై నియంత్రణ లేకపోవడం వల్ల ఆరోగ్యానికి హాని జరుగుతుంది.

టీని పూర్తిగా మానేయాల్సిన అవసరం లేదు. టీ తాగడం ఆరోగ్యకరమే అయినప్పటికీ, చేసే కొన్ని చిన్న పొరపాట్లు జీర్ణ వ్యవస్థను దెబ్బతీస్తాయి. కానీ మితమైన మోతాదులో, తక్కువ చక్కెరతో, సరైన సమయంలో తాగడం ద్వారా దాని అసలైన ప్రయోజనాలను పొందుతూ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు.