
ప్రపంచంలోనే అత్యంత పొడవైన ఈ రైలు పేరు 'ది ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్'. ఇది ప్యాసింజర్ కాదు, గూడ్స్ రైలు. ఈ రైలు మొదటిసారిగా 21 జూన్ 2001న పట్టాలెక్కింది. ఇంజిన్ నుంచి చివరి కంపార్ట్‌మెంట్ వరకు ఈ రైలు పొడవు 7.3 కిలో మీటర్లు ఉంటుంది. ఇందులో 8 లోకోమోటివ్ ఇంజన్లు, 682 కోచ్‌లతో కూడిన ఈ రైలు బొగ్గు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు.

పొడవుగా ఉండటమే కాదు.. ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ఓర్ అత్యంత బరువైన రైలు అనే గుర్తింపు కూడా కలిగి ఉంది. ఆస్ట్రేలియాలోని యాండీ మైన్ నుండి పోర్ట్ హెడ్‌ల్యాండ్ బీచ్ వరకు నడుస్తున్న ఈ రైలు 275 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేస్తుంది. దీనికి 10 గంటల సమయం పడుతుంది. రైలు సామర్థ్యం 82,000 టన్నుల ఇనుప ఖనిజం.

682 కోచ్‌లతో ప్రపంచంలోనే అత్యంత పొడవైన రైలు ఇదే. ఈ రైలు పొడవు 24 ఈఫిల్ టవర్లను కలిగి ఉంటుందని అంచనా. అత్యంత పొడవైన ఈ రైలును లాగడానికి ఒకటి లేదా రెండు ఇంజిన్లు సరిపోతాయా అనే సందేహం కూడా చాలా మందిలో వస్తుంది. అయితే, ఈ రైలు నడపడానికి 8 ఇంజన్లు అవసరమని సమాచారం. ఈ రైలు బరువు దాదాపు లక్ష టన్నులు.

ఆస్ట్రేలియన్ BHP ఐరన్ ధాతువు రైలు ప్రభుత్వానికి కాదు. ఒక ప్రైవేట్ సంస్థకు చెందిన రైలు. ఇది BHP అనే కంపెనీ నడుపుతున్న ప్రైవేట్ రైలు మార్గంలో నడుస్తుంది. ఇనుప ఖనిజం రవాణా కోసం కంపెనీ ఈ రైలు మార్గాన్ని, రైలును తయారు చేసింది. డిమాండ్ లేని కారణంగా ఇప్పుడు ఈ రైలులో కోచ్‌ల సంఖ్యను 270కి తగ్గించారు. ఇంజిన్లు 8కి బదులుగా 4కి తగ్గించబడ్డాయని తెలిసింది.

ఈ రైలు దక్షిణాఫ్రికాలోని అత్యంత పొడవైన రైలును వెనక్కి నెట్టేసి పొడవైన రైలు టైటిల్‌ను గెలుచుకుంది. ఆ రైలులో 660 కోచ్‌లు ఉన్నాయి. 'మౌంట్ న్యూమాన్ రైల్వే'గా పిలువబడే ఈ రైలును ఒకే డ్రైవర్ నడుపుతాడు.