
వేసవి వచ్చిందంటే చాలు ప్రతి ఒకరి ఇంటిలో మామిడికాయ పచ్చడి పెడుతుంటారు. అయితే మార్కెట్‌లో అనేక రకాల మామిడికాయలు అందుబాటులో ఉన్నాయి. దీంతో చాలా మంది ఊరగాయ మామిడికాయ, తినే మామిడి కాయకు తేడా తెలియదు. దీంతో తమ దగ్గర ఉన్న మామిడి కాయలతో పచ్చడి పెట్టి, టేస్ట్ బాలేదని, ఊరగాయ కుదరలేదని, అంతే కాకుండా చట్నీ త్వరగా పాడైపోయిందని బాధపడుతుంటారు. మరి అసలు ఊరగాయ పెట్టడానికి ఎలాంటి రకం మామిడికాయను తీసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం.

ఊరగాయ పెట్టడానికి కావాల్సిన మామిడి రకాల్లో బంగినపల్లి మామిడికాయ చాలా బెస్ట్. ఇది కాయగా ఉన్నప్పుడు మాత్రమే పెట్టాలి. ఇదే కాకుండా తోతాపురి మామిడికాయలు చాలా బెస్ట్ ఊరగాయకు, ఇవి కొంచెం పొడవుగా, లోపల గుజ్జుతో పాటు ,ఘాటైన పులుపును కలిగి ఉంటాయి. వీటితో ఊరగాయ పెడితే ఎన్ని సంవత్సరాలు అయినా సరే నిలువ ఉంటుంది.

అదే విధంగా పిక్క మామిడికాయలు, ఇవి చాలా చిన్నగా ఉంటాయి. ఊరగాయ పెట్టడానికి ఇవి చాలా బెస్ట్. వీటితో ఏ రకం ఊరగాయ పెట్టుకున్నా కూడా టేస్ట్ అదిరి పోవడమే కాకుండా ఎక్కువ రోజులు చెడిపోకుండా ఉంటుంది. అలాగే సంవత్సరాలు గడిచినా చాలా ఫ్రెష్‌గా ఉంటుంది.

ఊరగాయ పెట్టేముందు కూడా మామిడికాయలను సరిగ్గా ఎంచుకోవాలి. ముఖ్యంగా మెత్తగా చాలా పెద్ద పరిమాణంలో ఉన్నవాటిని అస్సలే ఊరగాయకు ఉపయోగించకూడదు. కాయ చాలా గట్టిగా, చాలా చిన్న పరిమాణం లేదా మధ్యస్థంగా ఉన్నవి మాత్రమే తీసుకోవాలి. అలాగే మామిడికాయను కాస్త గీసి చూస్తే పొలపు వాసన రావాలి. అప్పుడే ఆ కాయ ఊరగాయకు పనికి వస్తుంది.

ఇక మామిడికాయ ఊరగాయ పెట్టడానికి ఎప్పుడూ కూడా తాజా వాటిని మాత్రమే ఉపయోగించాలి. అలాగే కాస్త పాడైనవి, ఏదైనా నల్లటి మచ్చలు ఉన్నవాటిని అస్సలే ఉపయోగించకూడదు. వీటిని ఉపయోగిస్తే పచ్చడి మొత్తం పాడైపోయే ప్రమాదం ఉంటుంది.