
గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగల సామర్థ్యంతో డిజైన్ చేయబడిన ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్ సాధారణ ఆపరేటింగ్ వేగం గంటకు 160 కి.మీ. అయితే ప్రస్తుతం మన దేశంలోని రైల్వే ట్రాక్‌లు చాలావరకు గంటకు 110 నుండి 130 కి.మీ వేగంతో ప్రయాణించేందుకు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. వందే భారత్ తన పూర్తి సామర్థ్యంతో దూసుకెళ్లాలన్నా, దాని డిస్ట్రిబ్యూటెడ్ పవర్ సిస్టమ్‌ను తట్టుకోవాలన్నా ప్రస్తుత ట్రాక్‌లను ప్రత్యేక సాంకేతిక ప్రమాణాలతో ఆధునీకరించాల్సి ఉంది.

సాధారణ రైళ్ల రాకపోకల కోసం తేలికపాటి 52 కేజీల (90 UTS) పట్టాలను ఉపయోగిస్తారు. కానీ వందే భారత్ వంటి సెమీ హైస్పీడ్ రైలు వేగాన్ని, తీవ్రమైన భారాన్ని తట్టుకోవడానికి మరింత బరువైన, దృఢమైన 60 కేజీల (90 UTS) పట్టాలు అవసరం అవుతాయి. సాధారణ రైల్వే ట్రాక్‌లలో తక్కువ సాంద్రత కలిగిన ప్రీ-స్ట్రెస్డ్ కాంక్రీట్ స్లీపర్లు కిలోమీటరుకు సుమారు 1,540 మాత్రమే ఉంటాయి. అదే వందే భారత్ నడిచే మార్గాల్లో ట్రాక్ పక్కకు జరగకుండా స్థిరంగా ఉండేందుకు వెడల్పాటి, ఎక్కువ సాంద్రత కలిగిన కాంక్రీట్ స్లీపర్లను కిలోమీటరుకు 1,660 లేదా అంతకంటే ఎక్కువగా అమర్చాల్సి ఉంటుంది.

సాధారణ ట్రాక్ కింద సుమారు 250 మి.మీ లోతులో మాత్రమే కంకర రాళ్ల పొర ఉంటుంది. అయితే వందే భారత్ గరిష్ఠ వేగంతో వెళ్లేటప్పుడు వచ్చే తీవ్రమైన కుదుపులు, ప్రకంపనలను సమర్థవంతంగా తట్టుకునేందుకు ట్రాక్ కింద 300 మి.మీ లేదా అంతకంటే ఎక్కువ లోతుతో కూడిన కంకర పొరను వేయాల్సి ఉంటుంది.సాధారణ రైలు మార్గాల్లో సంప్రదాయ క్రాసింగ్లను వాడుతారు. కానీ వందే భారత్ వంటి రైళ్లు వేగంగా ఒక లైన్ నుంచి మరో లైన్‌కు మారే సమయంలో కుదుపులు లేకుండా సాఫీగా వెళ్లేందుకు 'థిక్ వెబ్ స్విచ్‌లు', ఆధునిక స్ప్రింగ్ మెకానిజమ్‌లను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.

సాధారణ ట్రాక్‌ల వద్ద మనుషులు, పశువులు పట్టాలు దాటేందుకు వీలుగా ఓపెన్ మార్గాలు ఉంటాయి. కానీ వందే భారత్ అత్యంత వేగంతో దూసుకెళ్లే సమయంలో పశువులు అడ్డురాకుండా, ప్రమాదాలు జరగకుండా నివారించేందుకు ట్రాక్ ఇరువైపులా పటిష్టమైన ఫెన్సింగ్ తప్పనిసరి. సాధారణ ట్రాక్‌లపై సంప్రదాయ బ్లాక్ సిగ్నలింగ్ వ్యవస్థ ఉంటుంది. అయితే హైస్పీడ్‌లో ప్రయాణించే వందే భారత్ రైలును సురక్షిత దూరంలో నిలపడానికి అధునాతన ఆటోమేటిక్ సిగ్నలింగ్ వ్యవస్థతో పాటు స్వదేశీ రక్షణ వ్యవస్థ అయిన 'కవచ్' తప్పనిసరిగా ఉండాలి.

మన దేశంలో ఉన్న ట్రాక్‌లలో అత్యధికం పాత ప్రమాణాలతో 110 కి.మీ వేగానికి అనుకూలంగా నిర్మించినవే కావడంతోనే వందే భారత్ ప్రస్తుతం 130 కి.మీ లేదా అంతకంటే తక్కువ వేగంతో నడుస్తోంది. ఈ మార్గాలన్నింటినీ సాంకేతికంగా ఆధునీకరించి, ఫెన్సింగ్ మరియు కవచ్ వంటి భద్రతా ఫీచర్లను పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెచ్చినప్పుడే వందే భారత్ తన పూర్తి వేగంతో పరుగులు తీస్తుంది.