
కావాల్సిన పదార్థాలు : ధనియాలు, లవంగాలు, దాల్చిన చెక్క, కోడి గుడ్లు, గసగసాలు, ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఉల్లిపాయ, ఆయిల్, ఎండు మిర్చి, జీలకర్ర, ఆవాలు, కారం, రుచికి సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు.

తయారీ విధానం :ముందుగా స్టవ్ ఆన్ చేసి, పాన్ తీసుకొని అందులో నీళ్లు పోసి, ఎగ్స్ వేసి, కోడి గుడ్లను మంచిగా ఉడకబెట్టుకోవాలి. కనీసం 15 నిమిషాలు గ్యాస్ స్టవ్ పైనే ఉంటే ఎగ్స్ మంచిగా ఉడుకుతాయి.

ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి, దానిపై పాన్ పెట్టి, అందులో లవంగాలు, ధనియాలు, యాలకులు, ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర వేసి మంచిగా వేయించుకోవాలి. అలాగే గసగసాలు, ఎండుకొబ్బరి తురుము కూడా వేసి కాస్త వేయించి పక్కన పెట్టుకోవాలి. దీనిని మిక్సీ పట్టుకొని మసాలా ప్రిపేర్ చేసుకోవాలి.

ఇప్పుడు మరో పాన్ పెట్టి అందులో కరివేపాకు రెబ్బలు వేసి, చాలా తక్కువ మంట పై నిమిషం పాటు వేయించి పక్కన పెట్టుకోవాలి. అలాగే దీనిని మంచి మిక్సీ పట్టుకొని మెత్తటి పౌడర్‌లా తయారు చేసుకోవాలి. మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి, అందులో కొంచెం నూనె పోసి, ఉడికి, పొట్టు తీసిన ఎగ్స్ వేసి మంచిగా వేయించుకోవాలి. తర్వాత వీటిని పక్కన పెట్టుకోవాలి. తర్వాత వీటిని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి.

ఇప్పుడు మళ్లీ స్టవ్ ఆన్ చేసి, పాన్ పెట్టి అందులో పచ్చి మిర్చీ, జీలకర్ర, ఆవాలు, తరిగిన ఉల్లిపాయ ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు , చిటికెడు పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేగిన తర్వాత కోడి గుడ్డు ముక్కలు, ముందుగా గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పొడి, మసాలా పొడి వేసి పెట్టుకోవాలి. ఐదు నిమిషాలు వేసి మంచిగా కలుపుకోవాలి. అంతే వేడి వేడి కోడి గుడ్డు కరివేపాకు ఫ్రై రెడీ.