
సాధారణ ఆరోగ్యవంతమైన వ్యక్తి రోజుకు ఒక పూర్తి కోడిగుడ్డును ఎటువంటి డౌట్స్ లేకుండా తినొచ్చని గుండె నిపుణులు వెల్లడిస్తున్నారు. గుడ్డు పసుపుసొనలో కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ, మనం తినే ఆహార కొలెస్ట్రాల్ నేరుగా రక్తంలో చెడు కొలెస్ట్రాల్‌గా మారదని పలు పరిశోధనలు నిరూపించాయి. గుడ్డులో ఉండే పోషకాలు, మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

టైప్-2 షుగర్ వ్యాధి, అధిక కొలెస్ట్రాల్ లేదా ఇప్పటికే గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు కాస్త జాగ్రత్తగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి వారు వారానికి 3 నుండి 4 పూర్తి గుడ్లు మాత్రమే తీసుకోవడం లేదా కేవలం తెల్లసొనను మాత్రమే తినడం మంచిది. గుడ్డు తెల్లసొనలో కొలెస్ట్రాల్ మరియు కొవ్వులు ఉండవు, కేవలం స్వచ్ఛమైన ప్రోటీన్ మాత్రమే లభిస్తుంది.

మనం గుడ్డును ఎలా వండుకుని తింటున్నాం అనే దానిపైనే మన గుండె ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఎక్కువ నూనె, వెన్న లేదా చీజ్ ఉపయోగించి ఆమ్లెట్లు వేసుకోవడం, లేదా ప్రాసెస్ చేసిన మాంసంతో కలిపి తినడం వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ప్రమాదకరంగా పెరుగుతుంది. కాబట్టి గుడ్లను ఉడకబెట్టి తినడం లేదా అతి తక్కువ నూనెతో ఎగ్ బుర్జీ చేసుకుని తినడం అత్యంత సురక్షితమైన మార్గం.

కండరాల బలం కోసం, వ్యాయామం చేసేవారు లేదా బాడీబిల్డర్లు రోజుకు 2 నుండి 3 కంటే ఎక్కువ గుడ్లు తినాల్సి వస్తే, వారు పసుపుసొనను పక్కన పెట్టి కేవలం తెల్లసొనను మాత్రమే తీసుకోవడం ఉత్తమం. దీనివల్ల శరీరానికి కావలసిన అధిక ప్రోటీన్ లభించడమే కాకుండా అదనపు కొవ్వు లేదా కొలెస్ట్రాల్ చేరే ప్రమాదం తగ్గుతుంది.

గుడ్డు అనేది గుండెకు శత్రువు కాదని, సరైన మోతాదులో, సరైన పద్ధతిలో తింటే అది ఒక అద్భుతమైన ఆరోగ్య వర్ధని అని కార్డియాలజిస్టులు చెబుతున్నారు. ఏదేమైనా.. తీవ్రమైన గుండె సమస్యలు లేదా శారీరక వ్యాయామం లేనివారు తమ ఆహారంలో గుడ్లను చేర్చుకునే ముందు వ్యక్తిగత వైద్యుల సలహా తీసుకోవడం మంచిది.