
కావలసిన పదార్థాలు: 2 వలిచిన నాటు మొక్కజొన్న పొత్తులు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 6 నుండి 7 పొట్టు తీయన వెల్లుల్లి రెబ్బలు , 3 నుండి 4 పచ్చిమిరపకాయలు, చాలా సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, సన్నగా తరిగిన రెమ్మ కరివేపాకు , పిడికెడు తాజా కొత్తిమీర తరుగు, రుచికి సరిపడా ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా వంట నూనె

తయారీ విధానం: రెండు నాటు మొక్కజొన్న పొత్తులను వలిచి గింజలను వేరుచేయాలి సుమారు 2 కప్పులు అవుతాయి. లేత మొక్కజొన్నలైతే నేరుగా వాడుకోవచ్చు. ఒకవేళ ముదురు గింజలైనా లేదా ఆరిపోయినట్లున్నా గంట లేదా రెండు గంటలు నీటిలో నానబెట్టి వాడుకుంటే మళ్లీ సాఫ్ట్‌గా మారతాయి.

కీలకమైన టిప్ మిక్సీ జార్‌లో ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, 6-7 వెల్లుల్లి రెబ్బలు, 3-4 పచ్చిమిరపకాయ ముక్కలు వేసి ఒక్కసారి కోర్స్‌గా బ్లెండ్ చేయాలి. ఆ తర్వాత అందులోనే వలిచిన 2 కప్పుల మొక్కజొన్న గింజలను వేయాలి. చుక్క నీరు కూడా పోయకుండా.. మధ్యమధ్యలో స్పూన్‌తో కలుపుతూ కాస్త బరకగా ఉండేలా గ్రైండ్ చేసుకోవాలి. ముదురు గింజలై సరిగ్గా నలగకపోతే నీటికి బదులుగా ఉల్లిపాయ ముక్క వేసి రుబ్బాలి; నీళ్లు పోస్తే రుచి మారుతుంది.

రుబ్బిన మిశ్రమాన్ని మిక్సింగ్ బౌల్‌లోకి తీసుకోవాలి. ఇందులో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, సన్నటి కరివేపాకు, పిడికెడు కొత్తిమీర తరుగు మరియు రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలపాలి. చేతితో పట్టుకుంటే గారెలా వత్తేందుకు వీలైన గట్టి ముద్దలా ఉండాలి. ఎక్స్‌ట్రా పిండి ఏదీ వేయకుండా ఇలా చేస్తేనే అసలైన నాటు రుచి వస్తుంది. స్టవ్‌పై కడాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పోసి మీడియం మంటపై వేడిచేయాలి.

నూనె కాగిన తర్వాత చేతికి నీటి తడి చేసుకుంటూ పిండిని చిన్న ముద్దలా తీసుకుని, అరచేతిపై లేదా ప్లాస్టిక్ కవర్‌పై గారెల్లా ఒత్తి వేడి నూనెలోకి జార్చాలి. నూనెలో వేసిన వెంటనే గరిటె పెట్టకూడదు; ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్‌పై గట్టిపడేవరకు వేగనివ్వాలి. ఆ తర్వాత నిదానంగా రెండో వైపుకు తిప్పుతూ రెండు వైపులా బంగారు రంగులోకి, క్రిస్పీగా మారే వరకు వేయించి టిష్యూ పేపర్‌పైకి తీసుకోవాలి. అంతే, నోరూరించే కరకరలాడే తెలంగాణ 'మొక్కజొన్న గారెలు' సిద్ధం! వర్షం పడుతున్న సాయంత్రం వేడివేడిగా తింటుంటే పైన క్రిస్పీగా, లోపల తియ్యటి-కారం కాంబినేషన్‌తో అమృతతుల్యంగా ఉంటాయి!