
ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో ప్రతి ఇంట్లోనూ ఈ బొరుగుల పోపును ఎంతో ఇష్టంగా చేసుకుంటారు. ట్రావెలింగ్ వెళ్లేటప్పుడు లేదా పిల్లల స్నాక్స్ బాక్స్‌ల కోసం ఒకసారి చేసి పెట్టుకుంటే కనీసం నెల రోజుల పాటు కరకరలాడుతూ తాజాగా ఉంటాయి. ఈ సింపుల్ అండ్ క్రిస్పీ కారం బొరుగుల తయారీ విధానాన్ని ఇప్పుడు వివరంగా చూద్దాం.

కావలసిన పదార్థాలు: ఒక పెద్ద గిన్నెడు మరమరాలు / బొరుగులు, 2 టేబుల్ స్పూన్ల నూనె, పావు కప్పు వేరుశనగ గుళ్లు, పావు కప్పు పుట్నాల పప్పు, ఆవాలు, అర టీస్పూన్ జీలకర్ర, 6 నుండి 8 - కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, 2 ఎండుమిర్చి, రెండు రెమ్మల తాజా కరివేపాకు, అర టీస్పూన్ పసుపు, 1 టీస్పూ కారం పొడి, పావు టీస్పూన్ చాట్ మసాలా లేదా గరం మసాలా, మరియు రుచికి సరిపడా ఉప్పు .

తయారీ విధానం: ఒకవేళ మీరు తీసుకున్న బొరుగులు కొద్దిగా మెత్తబడి ఉంటే.. ముందుగా పొడి బాండీలో వేసి చిన్న మంటపై 2 నిమిషాలు వేయిస్తే తిరిగి సూపర్ క్రంచీగా మారతాయి. స్టవ్ వెలిగించి వెడల్పాటి బాండీ లేదా కడాయి పెట్టి రెండు స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె వేడెక్కగానే పల్లీలు వేసి లో ఫ్లేమ్‌లో దోరగా వేయించాలి.

పల్లీలు సగం వేగిన తర్వాత పుట్నాల పప్పు వేసి మరో నిమిషం వేపాలి. ఆ తర్వాత ఆవాలు, జీలకర్ర, తుంచిన ఎండుమిర్చి, కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు మరియు తాజా కరివేపాకు వేసి వేయించాలి. వెల్లుల్లి, కరివేపాకు మంచి సువాసన వచ్చే వరకు వేగనివ్వాలి.

మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి పసుపు, కారం పొడి, కొద్దిగా సాల్ట్ మరియు కాస్త చాట్ మసాలా లేదా గరం మసాలా వేసి నూనెలో త్వరగా కలపాలి. మసాలాలు మాడిపోకుండా వెంటనే జాగ్రత్తపడాలి. తాలింపు సిద్ధమైన వెంటనే బొరుగులను బాండీలో వేసి గరిటెతో కింద నుంచి పైకి అంతా సమంగా కలిసేలా బాగా కలపాలి.

లో ఫ్లేమ్‌పై 2-3 నిమిషాలు కలుపుతూ వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. ఈ కారం బొరుగులు పూర్తిగా చల్లారిన తర్వాత గాలి చొరబడని డబ్బాలో భద్రపరిస్తే నెల రోజుల పాటు కరకరలాడుతూ ఎంతో తాజాగా ఉంటాయి. ఈ కారం బొరుగుల్లో సన్నటి ఉల్లిపాయ తరుగు, కొత్తిమీర, నిమ్మరసం పిండుకుని తింటే రోడ్డు పక్కన బండి మీద దొరికే 'ముంత మసాలా' టేస్ట్ ఇంట్లోనే అదిరిపోతుంది!