
కావలసిన పదార్థాలు: 250 గ్రాముల లేత బెండకాయలు, 1 స్పూన్ కారం పొడి, అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి , 1 స్పూన్ శనగపిండి, పావు స్పూన్ పసుపు, 4 స్పూన్ల వంట నూనె, పావు స్పూన్ పచ్చి శనగపప్పు, పావు స్పూన్ మినప్పప్పు, పావు స్పూన్ ఆవాలు , పావు స్పూన్ జీలకర్ర, 6 నుండి 7 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు, సన్నగా తరిగిన 5 పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన 1 మీడియం సైజు ఉల్లిపాయ, ఒక్క చుక్క నీళ్లు

తయారీ విధానం: బెండకాయలను కడిగి తడి లేకుండా తుడవాలి. ఒక్కో బెండకాయను నిలువుగా నాలుగు సన్నని చీలికలుగా కట్ చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకోవాలి. ఈ ముక్కల్లో 1 స్పూన్ కారం, అర స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ శనగపిండి, పావు స్పూన్ పసుపు మరియు 2 స్పూన్ల నూనె వేయాలి. ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకూడదు; అల్లం వేస్తే ముక్క త్వరగా ఉడికి జిగురుగా మారిపోతుంది. ముక్కలు విరిగిపోకుండా సున్నితంగా కలుపుతూ మసాలాలన్నీ ముక్కలకు పట్టించి 10 నిమిషాల పాటు మూతపెట్టి పక్కన ఉంచాలి.

స్టవ్‌పై కడాయి పెట్టి 2 స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర మరియు దంచిన వెల్లుల్లి రెబ్బలు వేసి చిన్న మంటపై వేయించాలి. వెల్లుల్లి వేగి కమ్మటి సువాసన రాగానే.. సన్నగా తరిగిన పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు వేసి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మగ్గించాలి.

ఉల్లిపాయలు వేగిన తర్వాత.. 10 నిమిషాలు మ్యారినేట్ చేసి ఉంచుకున్న బెండకాయ ముక్కల మిశ్రమాన్ని వేయాలి. మంటను పూర్తిగా లో ఫ్లేమ్‌లో ఉంచి గరిటెతో వేగంగా కలపకుండా చాలా నిదానంగా కలపాలి. వేగంగా కలిపితే ముక్కలు విరిగి జిగురు బయటకు వస్తుంది. మూతపెట్టి చిన్న మంటపై 2 నిమిషాలు మగ్గనివ్వాలి.

రెండు నిమిషాల తర్వాత మూత తీసి నిదానంగా కలపాలి. మ్యారినేట్ చేసిన ప్లేట్‌లో ఒక్క చుక్క నీళ్లు పోసి ఆ మసాలా నీటిని మాత్రమే చిలకరించి.. మూత తీసే ఉంచి బెండకాయ ముక్కలు రంగు మారి క్రిస్పీగా దగ్గరపడే వరకు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. అంతే, నోరూరించే కమ్మనైన 'చీలికల బెండకాయ ఫ్రై' సిద్ధం! వేడివేడి అన్నంలో కలుపుకుని తిన్నా లేదా రాత్రి డిన్నర్‌లో పుల్కా, చపాతీలతో తిన్నా ఒక్క ముద్ద కూడా మిగల్చకుండా లాగించేస్తారు!