
కావలసిన పదార్థాలు: పచ్చి అరటికాయలు 3, మజ్జిగ 1 కప్పు, ఉప్పు రుచికి సరిపడా, నూనె 3 టేబుల్ స్పూన్లు, పచ్చి శనగపప్పు 1 టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్, జీలకర్ర 1 టీస్పూన్, ఆవాలు అర టీస్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, పసుపు అర టీస్పూన్, ఎండుమిర్చి 6, ఎండు కొబ్బరి ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 1 టీస్పూన్, నువ్వులు 1 టేబుల్ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 10.

ముందుగా ఒక పెద్ద గిన్నెలో నీళ్లు పోసి, అందులో కొద్దిగా ఉప్పు, ఒక కప్పు మజ్జిగ వేసి కలపాలి. ఇప్పుడు పచ్చి అరటికాయల పైతొక్కను పీలర్‌తో మరీ లోతుగా కాకుండా పైన పచ్చని పొర పోయేలా మాత్రమే చెక్కాలి. ఆ తర్వాత మరీ చిన్నవి కాకుండా మీడియం సైజు ముక్కలుగా కోసి, వెంటనే మజ్జిగ నీళ్లలో వేయాలి. ఇలా చేయడం వల్ల అరటికాయ ముక్కలు నల్లబడకుండా తెల్లగా ఉంటాయి.

తర్వాత స్టవ్ మీద నాన్‌స్టిక్ పాన్ పెట్టి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. నాన్‌స్టిక్ పాన్ వాడటం వల్ల ముక్కలు అడుగు అంటకుండా సమానంగా వేగుతాయి. నూనె కాగిన తర్వాత పచ్చి శనగపప్పు, మినప్పప్పు, అర టీస్పూన్ జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి దోరగా వేయించాలి. ఇందులో నీళ్లలో నుండి తీసిన అరటికాయ ముక్కలు వేసి, మంటను తక్కువగా ఉంచి నిదానంగా వేయించాలి. రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఉప్పు, అర టీస్పూన్ పసుపు వేసి ముక్కలు చిదిమిపోకుండా నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి.

ముక్కలు వేగేలోపు ప్రత్యేక కారప్పొడి కోసం మిక్సీ జార్లో ఆరు ఎండుమిర్చి, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, అర టీస్పూన్ జీలకర్ర, ఒక టేబుల్ స్పూన్ నువ్వులు, పది వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసి నీళ్లు పోయకుండా పొడిపొడిగా గ్రైండ్ చేసుకోవాలి.

అరటికాయ ముక్కలు చక్కగా వేగి మెత్తబడిన తర్వాత, గ్రైండ్ చేసుకున్న కారప్పొడిని వేసి బాగా కలపాలి. సన్నని మంటపై మసాలాల పచ్చివాసన పోయేవరకు ఒకటి రెండు నిమిషాలు వేయించి స్టవ్ ఆఫ్ చేయాలి. వేడివేడి అన్నంలోకి గానీ, పప్పుచారు, టమాటా పప్పులోకి సైడ్ డిష్‌గా గానీ ఈ అరటికాయ వేపుడు వడ్డిస్తే ఎంతో రుచిగా ఉంటుంది.