
మంగళవారం కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలో జరుగుతోన్న భారత్ వర్సెస్ శ్రీలంక ఆసియా కప్ 2023 సూపర్ ఫోర్ మ్యాచ్‌లో శ్రీలంక స్పిన్నర్ దునిత్ వెల్లలాగే అద్భుత ప్రదర్శనతో టీమిండియాను చావు దెబ్బ కొట్టాడు. తొలిసారి 5 వికెట్ల హాల్‌తో టీమిండియా స్టార్ ప్లేయర్లకు చుక్కలు చూపించాడు.

20 ఏళ్ల ఈ ఎడమచేతి వాటం స్పిన్నర్ మూడు ఓవర్లలో శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను అవుట్ చేయడం ద్వారా భారత్ వేగవంతమైన ప్రారంభాన్ని అడ్డుకున్నాడు. ఆ తర్వాత కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యాల వికెట్లను పడగొట్టి తన మొదటి వన్డే 5 వికెట హాల్‌ను పూర్తి చేశాడు.

వెల్లలాగే దాడికి దిగే ముందు భారత్ 11 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 80 పరుగులు చేసింది. ఈ క్రమంలో రంగంలోకి దిగిన వెల్లలాగే తన మొదటి బంతికే గిల్‌ను అవుట్ చేశాడు. లెగ్‌పై పిచ్ చేసి ఆఫ్ స్టంప్‌ను పడగొట్టాడు.

ఆ తర్వాత షార్ట్ మిడ్‌వికెట్‌కు సులువుగా క్యాచ్ అందించిన కోహ్లి రెండో వికెట్‌గా పెవిలియన్ చేరాడు. ఆ తర్వాతి ఓవర్‌లో రోహిత్ ఔట్ అయ్యాడు. బంతి స్పిన్నింగ్ కాకపోవడంతో స్టంప్‌లను పడగొట్టి, హిట్‌మ్యాన్‌కు ఊహించని షాక్ అందించాడు.

ఆ తర్వాత రెండవ స్పెల్‌లో కేఎల్ రాహుల్ అందించిన రిటర్న్ క్యాచ్‌ను చక్కగా అందుకుని, గత మ్యాచ్‌లో సెంచరీ ప్లేయర్‌ను కేవలం 39 పరుగలకే పెవిలియన్ చేర్చాడు. ఇక 5 వ వికెట్‌గా హార్దిక్‌ను బలిపశువును చేసుకున్నాడు.

నెమ్మదిగా, మలుపు తిరుగుతున్నట్లు పిచ్‌లో మార్పు కనిపిస్తోంది. ఇది గిల్ ఔట్‌లో స్పష్టంగా కనిపించింది. ఎడమ చేతి వాటం ప్లేయర్ బంతిని ఉపరితలం నుంచి స్క్వేర్‌గా మార్చడంతో సఫలమయ్యాడు. అతను తన ఆర్మ్ బాల్‌ను పరిపూర్ణంగా ఉపయోగించాడు. బౌన్స్ చేయని స్ట్రెయిటర్ బంతితో రోహిత్‌ను అవుట్ చేశాడు.

2022 U19 ప్రపంచ కప్‌లో శ్రీలంక కెప్టెన్‌గా ఉన్న సమయంలో వెల్లలాగే తొలిసారిగా ప్రాముఖ్యతను సంతరించుకున్నాడు. టోర్నమెంట్‌లో అతను బ్యాట్‌తో రాణించడమే కాదు, బాల్‌తో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు.

వెల్లలాగే టోర్నమెంట్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌ల్లో 13.58 సగటుతో 17 వికెట్లు తీశాడు. అతను టోర్నమెంట్‌లో 44 సగటుతో 264 పరుగులు చేశాడు. శ్రీలంకలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు.

ఈ యువ స్పిన్నర్ 2022 జూన్‌లో పల్లెకెలెలో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో అరంగేట్రం చేశాడు. అక్కడ అతను రెండు వికెట్ల వికెట్లు పడగొట్టాడు. జులై 2022లో గాలేలో పాకిస్తాన్‌తో ఓ టెస్ట్ మ్యాచ్ కూడా ఆడాడు.