
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2022 సీజన్ ప్రారంభం కానుంది. ప్రతి సీజన్‌లాగే ఈసారి కూడా ఫోర్లు, సిక్సర్ల వర్షం కురవబోతుంది. అయితే మ్యాచ్ ఫలితాన్ని నిర్ణయించే మరో ముఖ్యమైన అంశం కూడా ఉంది. అవే ముఖ్యమైన క్యాచ్‌లు. ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు అందుకున్న ఆటగాళ్ల గురించి తెలుసుకుందాం.

సురేశ్ రైనా ఈసారి ఐపీఎల్‌లో ఆడటం లేదు. కానీ అతని రికార్డుల్లో ఒకటి ఇప్పటికీ అలాగే ఉంది. ఐపీఎల్‌లో చరిత్రలో ఇప్పటివరకు అత్యధిక క్యాచ్‌లు తీసుకున్న ఆటగాళ్లలో రైనా మొదటివాడు. ఈ చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ అద్భుతమైన ఫీల్డింగ్‌తో 204 ఇన్నింగ్స్‌లలో 109 క్యాచ్‌లను అందుకున్నాడు. 100కి పైగా క్యాచ్‌లు పట్టిన ఏకైక ఫీల్డర్ రైనా మాత్రమే.

రైనాకు అత్యంత సమీపంలో ముంబై ఇండియన్స్ దిగ్గజ కరేబియన్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ఉన్నాడు. 178 ఇన్నింగ్స్‌ల్లో 96 క్యాచ్‌లు పట్టి రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఈ సీజన్‌లో సెంచరీ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి.

ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ దక్షిణాఫ్రికా సూపర్‌మ్యాన్ ఇప్పుడు క్రికెట్ నుంచి రిటైర్ అయ్యాడు. ఈ RCB మాజీ అనుభవజ్ఞుడు 130 ఇన్నింగ్స్‌లలో 90 సార్లు ఫీల్డర్‌గా బ్యాట్స్‌మెన్‌లను పెవిలియన్‌కు చేర్చాడు. ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఈ విషయంలో డివిలియర్స్‌తో సమానంగా ఉన్నాడు. 213 ఇన్నింగ్స్‌లలో 90 క్యాచ్‌లు పట్టాడు.

ఆర్సీబీ మాజీ కెప్టెన్, అత్యుత్తమ ఫీల్డర్లలో ఒకరైన విరాట్ కోహ్లీ కూడా సెంచరీ రేసులో కొనసాగుతున్నాడు. అయితే ప్రస్తుతం 100 క్యాచ్‌లకు కాస్త దూరంగా ఉన్నాడు. కోహ్లి 205 ఇన్నింగ్స్‌ల్లో 84 క్యాచ్‌లు అందుకున్నాడు.