
హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియం రికార్డులకు వేదిక అయింది. బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో టీ20లో టీమిండియా బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో 297 పరుగులు చేయడమే కాదు.. టీ20ల్లో పలు రికార్డులను సొంతం చేసుకుంది.

బంగ్లాదేశ్‌పై 297 పరుగులే టీ20 క్రికెట్‌లో అత్యధిక జట్టు స్కోర్. అలాగే టీమిండియాకే ఇదే అత్యధిక స్కోర్ కూడా. అంతకముందు 2017లో శ్రీలంకపై టీమిండియా 260 పరుగులు చేయగా.. అదే సమయంలో టీ20 మ్యాచ్‌లో టీమిండియా 250 పరుగుల మార్కును దాటడం ఇది మూడోసారి.

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఫాస్టెస్ట్ టీం సెంచరీ రికార్డును భారత జట్టు సొంతం చేసుకుంది. కేవలం 7.1 ఓవర్లలోనే టీమ్ ఇండియా 100 పరుగుల మార్కును అధిగమించి సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించింది.

అలాగే 10 ఓవర్లలోనే అత్యధిక స్కోరు సాధించిన జట్టుగా కూడా టీమిండియా రికార్డు సృష్టించింది. సంజూ శాంసన్, సూర్యకుమార్ యాదవ్‌లు 10 ఓవర్లలో భారత్ స్కోరు బోర్డుపై 150 పరుగుల మార్క్ దాటించారు.

దీంతో టీ20 క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా 100, 150, 200, 250 పరుగులు చేసిన రికార్డును భారత్ తన ఖాతాలో వేసుకుంది. కేవలం 84 బంతుల్లోనే 200 పరుగులు పూర్తి చేసింది టీమిండియా.

అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన జట్టుగా భారత జట్టు రికార్డు సృష్టించింది. బంగ్లాదేశ్‌పై భారత బ్యాట్స్‌మెన్లు మొత్తం 22 సిక్సర్లు కొట్టారు. ఇది సరికొత్త ప్రపంచ రికార్డు. అలాగే, ఈ మ్యాచ్‌లో 25 ఫోర్లు బాదారు.

అభిషేక్ శర్మ ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన సూర్య.. సంజుతో కలిసి విధ్వంసం సృష్టించాడు. పవర్‌ప్లే తొలి ఆరు ఓవర్లలో సంజు, సూర్య కలిసి 82 పరుగులు చేశారు. టీ20 మ్యాచ్‌లో ఓ పవర్‌ప్లేలో టీమిండియా నమోదు చేసిన అత్యధిక స్కోరు ఇది.

ఈ మ్యాచ్‌లో, సంజూ శాంసన్ 47 బంతుల్లో 111 పరుగులు చేసి చిరస్మరణీయమైన ఇన్నింగ్స్ ఆడగా, సూర్యకుమార్ యాదవ్ 35 బంతుల్లో 75 పరుగులు చేశాడు. చివరి ఓవర్లలో హార్దిక్ పాండ్యా కేవలం 18 బంతుల్లో 47 పరుగులు చేశాడు.

అటు సంజూ శాంసన్ టీ20ల్లో తొలి భారత వికెట్ కీపర్, బ్యాటర్‌గా సెంచరీ నమోదు చేసుకున్నాడు. అలాగే రెండో ఫాస్టెస్ట్ సెంచరీగా, ఒకే ఓవర్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు శాంసన్.