
ఢిల్లీ టెస్టులో ఆస్ట్రేలియాను కేవలం రెండున్నర రోజుల్లోనే చిత్తు చేసిన భారత క్రికెట్ జట్టు.. ఫుల్ జోష్‌లో ఉంది. దాదాపుగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని గెలుచుకున్నట్లేనని తెలుస్తోంది. అలాగే డబ్ల్యూటీసీ ఫైనల్‌లోనూ భారత్ తన స్థానాన్ని ఖాయం చేసుకున్నట్లే. ఈ క్రమంలో మ్యాచ్ అనంతరం తమ ఖాళీ సమయాన్ని రాజధానిలోని ప్రధానమంత్రి మ్యూజియాన్ని సందర్శినలో మునిగిపోయారు.

న్యూఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఫిబ్రవరి 17న ప్రారంభమైన బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో టెస్టు మ్యాచ్ ఫిబ్రవరి 19 ఆదివారం మూడో రోజు రెండో సెషన్‌లో ముగిసింది. భారత జట్టు విజయానికి 115 పరుగులు చేయాల్సి ఉండగా, అది 4 వికెట్లు కోల్పోయి 2-0తో సిరీస్‌లో ఆధిక్యాన్ని సాధించింది.

నాగ్‌పూర్‌లో జరిగిన తొలి టెస్టులోనూ రెండున్నర రోజుల్లోనే టీమిండియా విజయం సాధించింది. ఈ విధంగా రెండు టెస్టుల్లోనూ కేవలం మూడు రోజుల్లోనే ఫలితం రావడంతో ఆటగాళ్లకు ఖాళీ సమయం దొరికింది. ఈ సమయాన్ని టీమిండియా ఆటగాళ్లు సద్వినియోగం చేసుకున్నారు.

మూడో టెస్టు మార్చి 1 నుంచి ప్రారంభం కానుండగా, అంతకు ముందు టీమ్ ఇండియాకు రెండున్నర రోజుల అదనపు విరామం లభించింది. దేశ రాజధానిలో ఉండటంతో జట్టు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవడంతో ఆటగాళ్లు ప్రధాని మ్యూజియాన్ని సందర్శించారు.

భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) తన ట్విట్టర్ ఖాతాలో ఈ సమాచారాన్ని అందించింది. దీనిలో కెప్టెన్ రోహిత్ శర్మ, మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రాహుల్ ద్రవిడ్ సహా మొత్తం టెస్ట్ జట్టు, సహాయక సిబ్బంది మ్యూజియంలో కనిపించారు.

ఈ మ్యూజియాన్ని 14 ఏప్రిల్ 2022న ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ మ్యూజియం న్యూఢిల్లీలోని తీన్ మూర్తి ప్రాంతంలో ఉంది. ఇది దేశ మొదటి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ నివాసంగా ఉండేది.

దేశంలోని మొత్తం 15 మంది ప్రధానులు, వారికి సంబంధించిన అంశాలు, ఇతర ప్రత్యేక ప్రదర్శనల గురించి ఇందులో సమాచారం ఉంటుంది.

సిరీస్ గురించి మాట్లాడితే, 2-0 తేడాతో బోర్డర్-గవాస్కర్ ట్రోఫీపై భారత్ ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు సిరీస్‌లోని మిగిలిన రెండు మ్యాచ్‌లపైనా కన్ను పడింది. మూడో టెస్టు మార్చి 1 నుంచి ఇండోర్‌లో, చివరి టెస్టు మార్చి 9 నుంచి అహ్మదాబాద్‌లో జరగనుంది.

ఢిల్లీలో విజయం తర్వాత బీసీసీఐ చివరి రెండు టెస్టులకు జట్టును ప్రకటించగా, ప్రస్తుతానికి అందులో ఎలాంటి మార్పులు చేయలేదు.