
టీమిండియాకు చెందిన ఇద్దరు స్టార్ క్రికెటర్లు త్వరలో పెళ్లికొడుకులుగా మారిపోనున్నారు. కేఎల్ రాహుల్ పెళ్లి గురించి గతేడాది నుంచి వార్తలు వస్తున్నాయి. అయితే ఇదే సమయంలో మరో టీమిండియా ప్లేయర్ పెళ్లిపీటలెక్కనున్నాడు. అతనెవరో కాదు స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్

అక్షర్ పటేల్ తన ప్రియురాలు మేహా పటేల్‌తో కలిసి ఈ నెలలోనే ఏడడుగులు నడవనున్నాడు. ఈ కారణంగానే న్యూజిలాండ్‌తో జరిగే వన్డే, టీ20 సిరీస్‌ల నుంచి బీసీసీఐ అతనికి విశ్రాంతి కల్పించింది. అయితే జట్టును ప్రకటించినప్పుడు మాత్రం కుటుంబ కారణాల వల్ల అక్షర్ సిరీస్‌కు అందుబాటులో లేడని బోర్డు తెలిపింది.

అక్షర్ చాలా కాలంగా మేహాతో డేటింగ్ చేస్తున్నాడు. గతేడాది తన పుట్టినరోజు (జనవరి 20) సందర్భంగా మేహాకు రొమాంటిక్‌గా ప్రపోజ్ చేశాడు. అనంతరం తమ ప్రేమ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఇద్దరి ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేశాడు.

అక్షర్ పటేల్ కాబోయే భార్య మేహా వృత్తి రీత్యా డైటీషియన్ అలాగే న్యూట్రిషనిస్ట్ కూడా. ఈక్రమంలో అక్షర్ డైట్ విషయంలో ఆమె జాగ్రత్తలు తీసుకుంటోంది. అంతేకాకుండా ఇద్దరికి ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం.

మేహా చేతిపై 'AKSH' అని పచ్చబొట్టు వేయించుకుందంటే అక్షర్ అంటే ఆమెకు ఎంత ప్రేమో ఇట్టే అర్థం చేసుకోవచ్చు. కాగా గతేడాది ఐపీఎల్ సీజన్‌లో సందడి చేసింది మేహా. అక్షర్ పటేల్ ప్రాతినిథ్యం వహిస్తోన్న ఢిల్లీ జట్టును ప్రోత్సహించింది.