
Yashasvi Jaiswal and Sarfaraz Khan Stats: టీమిండియా వచ్చే నెలలో వెస్టిండీస్ టూర్‌కు వెళ్లాల్సి ఉంది. ఈ పర్యటనలో భారత జట్టు రెండు టెస్టులతో సహా మూడు వన్డేలు, 5 టీ20ల సిరీస్ ఆడాల్సి ఉంది. కాగా, రెండు టెస్టుల సిరీస్‌లో సీనియర్ ప్లేయర్లకు రెస్ట్ ఇవ్వవచ్చని అంటున్నారు. ఇటువంటి పరిస్థితిలో కొంతమంది యువ ఆటగాళ్లకు అవకాశం లభిస్తుందని అంతా భావిస్తున్నారు.

వెస్టిండీస్‌తో జరిగే టెస్టు సిరీస్‌లో రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాట్స్‌మెన్ విరాట్ కోహ్లి, ఛెతేశ్వర్ పుజారా, ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షమీ, సిరాజ్‌లకు విశ్రాంతి ఇస్తారంటూ వార్తలు వస్తున్నాయి. తాజాగా మరోసారి ఈ యువ బ్యాట్స్‌మెన్స్‌కు అవకాశం కల్పించాలనే డిమాండ్ వినిపిస్తోంది.

రంజీ ట్రోఫీలో సర్ఫరాజ్ ఖాన్ చాలా కాలంగా పరుగులు చేస్తున్నాడు. ఈ క్రమంలో సర్ఫరాజ్ ఖాన్‌ను టెస్టు జట్టులోకి చేర్చాలని డిమాంట్లు తెరపైకి వచ్చాయి. యశస్వి జైస్వాల్‌తోపాటు, సర్ఫరాజ్ ఖాన్‌ను కూడా సుదీర్ఘ ఫార్మాట్‌లో అవకాశం కల్పించాలంటూ అటు మాజీలు, ఇటు అభిమానులు డిమాండ్ చేస్తున్నారు.

సర్ఫరాజ్ దేశవాళీ క్రికెట్‌లో సుదీర్ఘమైన ఫార్మాట్‌లో నిరంతరం పరుగులు చేస్తున్నాడు. మరోవైపు యశస్వి ఐపీఎల్, రంజీ, ఇండియా-ఏ, విజయ్ హజారేలలో పరుగులు సాధిస్తూ టీమ్ ఇండియా తలుపు తడుతున్నాడు.

ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 37 మ్యాచ్‌లు ఆడిన సర్ఫరాజ్ ఖాన్.. దాదాపు 80 సగటుతో 3505 రన్స్ చేశాడు. 13 సెంచరీలతోపాటు 9 హాఫ్ సెంచరీలు బాదిన సర్ఫరాజ్ కాన్.. అత్యధిక స్కోరు 301 పరుగులతో అజేయంగా నిలిచి, సత్తా చాటాడు.

దేశవాళీ క్రికెట్‌లోని అన్ని ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన చేసిన యశస్వి జైస్వాల్.. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో దంచి కొడుతున్నాడు. జైస్వాల్ 15 మ్యాచ్‌ల్లో 80.21 సగటుతో 1845 పరుగులు చేశాడు. 9 సెంచరీలు, 2 అర్ధ సెంచరీలు బాదేశాడు. జైస్వాల్ అత్యధిక స్కోరు 265 పరుగులు. దేశవాళీలో 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఈ యంగ్ ప్లేయర్ డబుల్ సెంచరీతో సత్తా చాటాడు.