
Dasun Shanaka: ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరంగా ఓడిపోయిన శ్రీలంక క్రికెట్ జట్టులో మార్పుల పవనాలు మొదలయ్యాయి. అవును, శ్రీలంక క్రికెట్ జట్టు కెప్టెన్ దసున్ షనక వన్డే వరల్డ్ కప్‌కి ముందే తన కెప్టెన్సీ నుంచి తప్పుకోబోతున్నట్లు తెలుస్తోంది.

పలు నివేదికల ప్రకారం, దసున్ షనకను కెప్టెన్సీ నుండి తొలగించే విషయంపై శ్రీలంక క్రికెట్ బోర్డు త్వరలో సమావేశం నిర్వహించనుంది. అలాగే అతని స్థానంలో కుశాల్ మెండిస్‌ను శ్రీలంక క్రికెట్ జట్టుకు కెప్టెన్‌గా తీసుకోవచ్చనే చర్చ బోర్డ్ మెంబర్లలో ఉందని సమాచారం.

షనక నాయకత్వం గురించి మాట్లాడుకోవాలంటే లంకకు సారథిగా అతను మెరుగ్గానే ఆడాడని లెక్కలు చెబుతున్నాయి. దసున్ షనక కెప్టెన్సీలో శ్రీలంక 37 మ్యాచ్‌లు ఆడి 23 విజయాలు సాధించింది. 14 మ్యాచ్‌ల్లోనే ఓడిపోయింది. అంటే షనక నాయకత్వంలో లంక గెలుపు శాతం 60.5.

అలాగే దసున్ షనక కెప్టెన్సీలోనే లంక.. 8 ఏళ్ల తర్వాత దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్, 12 ఏళ్ల తర్వాత ఆస్ట్రేలియాపై విజయం సాధించింది. ఇంకా షనక నాయకత్వంలోనే శ్రీలంక 2022 ఆసియా కప్ విజేతగా.. 2023 ఆసియా కప్ రన్నరప్‌గా నిలిచింది.

అయితే ఆసియా కప్ ఫైనల్‌లో భారత్ ముందు లంక పొందిన ఒక్క ఓటమితోనే అతని కెప్టెన్సీపై వేటు వేయకూడదనే వాదన కూడా సాగుతోంది. ఈ క్రమంలో షనకను కెప్టెన్సీపై శ్రీలంక క్రికెట్ బోర్డు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే.