
మన ఇళ్లలో తరచూ కనిపించే బొద్దింకలు కేవలం అసహ్యకరమైన కీటకాలు మాత్రమే కావు, వాటి వెనుక నమ్మశక్యం కాని ఎన్నో జీవశాస్త్ర రహస్యాలు దాగి ఉన్నాయి. బొద్దింక అత్యంత విచిత్రమైన లక్షణం ఏమిటంటే, దాని తల నరికివేసినా అది సుమారు ఒక వారం రోజుల పాటు బతికే ఉంటుంది!

మానవుల వలే ఇవి శ్వాస తీసుకోవడానికి నోరు లేదా ముక్కుపై ఆధారపడవు. వీటి శరీర భాగాలలో ఉండే చిన్న రంధ్రాల ద్వారా ఆక్సిజన్ పీల్చుకుంటాయి. చివరకు నోరు లేకపోవడం వల్ల నీరు తాగలేక దాహంతోనే అవి చనిపోతాయి.

ఫాసిల్ ఆధారాల ప్రకారం బొద్దింకలు దాదాపు 300 మిలియన్ సంవత్సరాల క్రితం నుంచే భూమిపై ఉన్నాయి. అంటే డైనోసార్లు భూమిపైకి రాకముందు నుంచే ఇవి జీవిస్తున్నాయి. అనేక రకాల ఆపదలు, శీతోష్ణస్థితి మార్పులను తట్టుకుని ఇప్పటికీ మనుగడ సాగిస్తున్నాయి.

బొద్దింకలు నీటి అడుగున దాదాపు 30 నుండి 40 నిమిషాల పాటు శ్వాస బిగపట్టి ఉండగలవు. శరీరంలోని నీటి శాతాన్ని నియంత్రించుకోవడానికి ఇవి తరచూ శ్వాసను ఆపుతుంటాయి.

బొద్దింకలు పరిగెత్తడంలో చాలా వేగవంతమైనవి. ఇవి గంటకు దాదాపు 3 మైళ్ల (4.8 కి.మీ) వేగంతో ప్రయాణించగలవు. ఇవి ఎంత వేగంగా దిశ మార్చుకోగలవంటే, శత్రువుల నుండి చిటికెలో తప్పించుకోగలవు. ఆహారం దొరక్కపోతే బొద్దింకలు కాగితాలు, జిగురు, సబ్బులు, తోలు వస్తువులు, పుస్తకాల బైండింగ్స్‌ను కూడా తినేస్తాయి. ఆహారం లేకపోయినా నెల రోజుల పాటు ఇవి సునాయాసంగా జీవించగలవు.

అమెరికన్ బొద్దింకలకు ఆల్కహాలిక్ పానీయాలు, ముఖ్యంగా బీర్ వాసన అంటే చాలా ఇష్టం. బీర్‌లో ఉండే షుగర్స్, ఈస్ట్/హాప్స్ వాసన వీటిని అమితంగా ఆకర్షిస్తాయి. ఈ విధంగా బొద్దింకలు ఎంత హానికరం అయినప్పటికీ, వాటి మనుగడ సాగించే విచిత్రమైన సామర్థ్యం శాస్త్రవేత్తలను సైతం ఆశ్చర్యపరుస్తుంది.