
సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బాక్సాఫీస్ దగ్గర వెంకటేష్ సృష్టిస్తున్న ప్రభంజనం చూస్తుంటే అందరికీ కళ్లు బైర్లు కమ్ముతున్నాయి. సంక్రాంతికి వచ్చిన ఈమూవీ కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది.

అసలు ఈ స్థాయిలో వెంకీ సినిమాకు వసూళ్లు వస్తాయని దిల్ రాజు, అనిల్ రావిపూడి సైతం ఊహించి ఉండరేమో..? కేవలం 5 రోజుల్లోనే 161 కోట్లు వసూలు చేసింది ఈ చిత్రం. ఫస్ట్ వీక్ అయ్యేలోపే డబుల్ సెంచరీ కొట్టేలా ఉన్నారు వెంకటేష్.

సీనియర్ హీరోలలో 200 కోట్లు వసూలు చేసిన ఒకే ఒక్క హీరో చిరంజీవి. ఆరేళ్ళ కింద సైరాతో తొలిసారి 200 కోట్లు వసూలు చేసారు చిరంజీవి. కమర్షియల్‌గా సైరా ఫ్లాప్ అయినా.. 240 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. ఇక రెండేళ్ళ కింద సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్యతో రెండో డబుల్ కొట్టారు మెగాస్టార్. ఈ చిత్రం 235 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.

అఖండ తర్వాత 2.0 వర్షన్ చూపిస్తున్న బాలయ్య.. ప్రతీసారి 100 కోట్ల దగ్గరే ఆగిపోతున్నారు. ఇక ఎఫ్ 2, ఎఫ్ 3తో 100 కోట్లు కొట్టిన వెంకీ మామ.. సంక్రాంతికి వస్తున్నాంతో 200 కోట్లు అందుకోబోతున్నారు.

ఈ సినిమా దూకుడు చూస్తుంటే 300 కోట్లు కూడా సాధ్యమే అనిపిస్తుంది. అనిల్ రావిపూడి బ్రాండ్, వెంకటేష్ ఇమేజ్ కలిసి సంక్రాంతికి వస్తున్నాంను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టాయి.