
టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ప్రస్తుతం గర్భిణి అన్న సంగతి తెలిసిందే. ఇటీవలే మా ఇంటి బంగారం సినిమాతో భారీ విజయాన్ని అందుకున్న సామ్.. ఇప్పుడు విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే తాజాగా సమంతకు గోద్ భరాయి (సీమంత) వేడుకలను ఘనంగా నిర్వహించారు కుటుంబసభ్యులు. అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోస్ షేర్ చేస్తూ శ్రీవిద్య ఉపాసనతో కూడిన ఈ వేడుక గురించి ఇన్ స్టా వేదికగా రాసుకొచ్చారు సామ్.

"మన సంప్రదాయాల పట్ల నాకు ఎప్పుడూ ఎంతో గౌరవం ఉంది. ప్రతి ఆచారం వెనుక ఉన్న అంతరార్థం నాకు పూర్తిగా తెలియకపోవచ్చు; కానీ మంత్రోచ్ఛారణలోని ధ్వని, ఆ జపం ద్వారా ఉత్పన్నమయ్యే శక్తి, ప్రాచీన ఆచారాలు తరతరాలుగా ఎంతో శ్రద్ధతో మనకు అందించబడిన విధానం. వీటన్నింటి వెనుక ఏదో లోతైన విశిష్టత దాగి ఉందని నేను ఎప్పుడూ నమ్ముతాను" అంటూ రాసుకొచ్చారు సామ్.

కళా ఆవరణం (శ్రీ కల్పం): శ్రీవిద్య సాంప్రదాయంలో గర్భవతికి నిర్వహించే ఒక ప్రత్యేకమైన పూజా విధానం. ఇందులో దేవికి చెందిన 94 కళలను, తల్లి శరీరంలోని ఏడు చక్రాల ద్వారా ఆవాహన చేస్తారు. పవిత్ర జలం, మంత్రోచ్ఛారణతో ఆ చక్రాలను శుద్ధి చేసి శక్తినంతం చేస్తారు అని తెలిపారు. దీని ద్వారా అమ్మవారి దివ్య గుణాలు ఆ మహిళలో చైతన్యం నింపుతాయని భావిస్తారు. తనలోని మరో ప్రాణానికి రూపమిస్తున్న సృష్టికర్తగా తల్లిని గౌరవించడం.. ఆమె గర్భంలో పెరుగుతున్న బిడ్డకు ఇదొక ఆశీర్వాదం మాత్రమే కాదు.. కొత్త జీవితంలోకి అడుగుపెడుతున్న మహిళకు ఆశీర్వచనమే.

శ్రీ చక్ర యంత్రం & ఖడ్గమాల: అభిషేకం తర్వాత, తల్లిని శ్రీ చక్ర యంత్రం మధ్యలో కూర్చోబెడతారు. దేవీ ఖడ్గమాల స్తోత్రం చదువుతూ తొమ్మిది ఆవరణలలోని దేవతలను స్మరిస్తారు. రక్షణ, సంస్కారం: ఈ మంత్రోచ్ఛారణ తల్లి , బిడ్డ చుట్టూ ఒక రక్షాకవచాన్ని ఏర్పాటు చేస్తుందని, పుట్టకముందే బిడ్డకు ఒక ఆధ్యాత్మిక సంస్కారాన్ని అందిస్తుందని నమ్ముతారు.

అనుభూతి: వేడుక గురించి ముందస్తు అవగాహన లేకపోయినా, ఈ అనుభవం ద్వారా ఎంతో ఆశీర్వదించబడినట్లుగా ఆధ్యాత్మిక ప్రశాంతత లభించింది. ఇదిలా ఉంటే.. గతంలో భూతశుద్ధి పద్ధతిలో సమంత, రాజ్ నిడిమోలు పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడు వీరిద్దరి వివాహ పద్ధతి బాగా ట్రెండ్ అయ్యింది. సమంత సీమంతం వేడుకలో ఆమె స్నేహితురాలు శిల్ప పాల్గొన్నారు. మెగా కోడళ్లు, ఉపాసన, లావణ్య, నీరజా కోన, నజ్రియా ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.