
ఒంటిపై ఎలాంటి షర్టు వేసుకోకుండా కారం అభిషేకానికి దిగారు శివస్వామి. ఇది ఆయనకు మొదటి సారి కాదు.. కొన్ని ఏళ్లుగా ఈ అభిషేకం చేసుకుంటున్నారు. ఒంటిపై కేజీల కొద్దీ కారం పోసుకున్నా.. తొణకలేదు.. బెనకలేదు.

ఒకసారి ఈ ఫోటో చూడండి. వంద కేజీల కారంతో శివస్వామికి అభిషేకం చేస్తున్నారు భక్తులు. ఈ కారం అభిషేకం ఏలూరు జిల్లా దొరసానిపాడులోని శ్రీ శివ దత్త ప్రత్యంగిరి ఆశ్రమంలో జరిగింది.

సాధారణంగా అభిషేకం అంటే ఆలయాల్లో పాలు, పంచామృతాలు, తేనె ఇతరత్ర వాటితో శిలా రూపంలో ఉన్న ఉత్సవమూర్తులకు అభిషేకిస్తారు. ఇటీవల కాలంలో అయితే రాజకీయ నాయకులు, సినిమా స్టార్ల ఫ్లెక్సీలకు కూడా అభిషేకాలు చేసేస్తున్నారు ఫ్యాన్స్... కాని ఇక్కడి భక్తి వేరు. శివస్వామికి భక్తులు స్వయంగా తెచ్చిన కారంతో అభిషేకించారు.

ఇలా స్వామికి కారంతో అభిషేకం చేస్తే తమకు మంచి జరుగుతుందంటున్నారు భక్తులు. మూడేళ్లుగా అభిషేకంలో పాల్గొంటున్నామంటున్నారు.

హిరణ్యకశికుడిని నరసింహస్వామి వధించిన అనంతరం స్వామివారి ఉగ్రరూపాన్ని తగ్గించేందుకు ప్రత్యంగరి దేవి ఉద్భవించిందనీ పురాణాలు చెబుతున్నాయి. అయితే ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలు అంటే ఎంతో ఇష్టం. అంతేకాక ప్రత్యంగిరీ దేవికి ఎండుమిరపకాయలను మెడలో హారంగా చేసి దండలు వేసి పూజిస్తారు. అలాంటి ఎండుమిరపకాయలను కారం చేసి ప్రత్యంగిరి ఆవాహనలో ఉన్న శివ స్వామిని అభిషేకిస్తే వారికి బాధలు, కష్టాలు తొలగిపోతాయన్నది నమ్మకం.

శత్రువినాశనం జరిగి, లక్ష్మీ కటాక్షం పొందుతారని, అంతేకాక దేవికి ఇష్టమైన ప్రసాదంగా కారాన్ని ఉపయోగిస్తారనీ అంటున్నారు. ప్రతి సంవత్సరం కార్తీకమాసంలో కారంతో అభిషేకం చేయడం ఆనవాయితీగా వస్తుందని, గత 14 సంవత్సరాలుగా కారంతో అభిషేకం నిర్వహిస్తున్నామంటున్నారు అభిషేకానికి హాజరైన పూజారులు.