
పే లేటర్ ఆప్షన్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది. ఈ-కామర్స్ వెబ్‌సైట్లలో ఆన్‌లైన్ షాపింగ్, ఫుడ్ డెలివరీ, ఎలక్ట్రానిక్స్ కొనుగోళ్లు చేసేప్పుడు ఈ ఆప్షన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మీరు ముందే డబ్బులు పే చేయాల్సిన అవసరం ఉండదు. పే లెటర్ యాప్స్ నిర్వాహకులు ముందుగా మీ తరపున షాపింగ్‌కు బిల్ పే చేస్తారు. 15 లేదా నెల రోజుల్లోగా మీరు సదరు ఫ్లాట్‌ఫామ్‌కి తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. వీటికి ఎలాంటి వడ్డీ అనేది పడదు. దీంతో చాలామంది పే లెటర్ విధానంలో షాపింగ్ చేస్తూ ఉంటారు.

ఈ ఫ్లాట్‌ఫామ్స్ వినియోగదారులకు ఉత్పత్తులను తక్షణమే కొనుగోలు చేసి తర్వాత సులభ వాయిదాల్లో లేదా నిర్ణీత కాలంలో చెల్లించేందుకు వీలు కల్పిస్తుంది. ఈ ఫీచర్ సౌకర్యాన్ని అందిస్తున్నప్పటికీ.. ఇది క్రెడిట్ రిపోర్టును ప్రభావితం చేస్తుంది. మీ సిబిల్ స్కోర్ తగ్గితే భవిష్యత్తులో రుణం పొందే మీ అవకాశాలు తగ్గుతాయి. ఇలాంటి ఫ్లాట్‌ఫామ్స్ ప్రొవైడర్లు కస్టమర్ల తిరిగి చెల్లింపు ప్రవర్తనను CIBIL వంటి క్రెడిట్ బ్యూరోలకు సమర్పిస్తాయి.

దీంతో మీరు డ్యూ డేట్ కల్లా తిరిగి చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. తిరిగి చెల్లింపు హిస్టరీని నిర్మించడంలో ఇది సహాయపడుతుంది. అయితే చెల్లింపులను కోల్పోవడం లేదా ఆలస్యం చేయడం మీ CIBIL స్కోర్‌ను తగ్గించవచ్చు. సంవత్సరాల తరబడి మీ క్రెడిట్ రిపోర్ట్‌లో అలాగే ఉండిపోతాయి. దీని వల్ల భవిష్యత్తుల మీకు లోన్లు మంజూరు అవ్వవు.

ఒక్కసారి పేమెంట్ ఆలస్యమైనా మీ చెల్లింపు హిస్టరీని ప్రభావితం చేస్తుంది. పదేపదే డిఫాల్ట్‌లు చేయడం వల్ల భవిష్యత్తులో గృహ రుణం, వ్యక్తిగత రుణం లేదా క్రెడిట్ కార్డ్ పొందడాన్ని మరింత కష్టతరం అవుతుంది. తక్కువ వ్యవధిలో అనేక BNPL ఖాతాలను తెరవడం మీ క్రెడిట్ ప్రొఫైల్‌ను కూడా ప్రభావితం చేయవచ్చు. ప్రతి కొత్త క్రెడిట్ ఖాతా మీ మొత్తం క్రెడిట్ ఎక్స్‌పోజర్‌ను పెంచుతుంది.

మీరు ఒకే సమయంలో అనేక BNPL సేవలపై ఎక్కువగా ఆధారపడితే.. మీరు అప్పు తీసుకున్న డబ్బుపై మరీ ఎక్కువగా ఆధారపడుతున్నారని బ్యాంకులు అనుకుంటాయి. దీంతో పే లేటర్ ఫ్లాట్‌ఫామ్స్ ఉపయోగించే సమయంలో అనేక జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి.