
రిస్క్ లేకుండా స్థిరమైన నెలవారీ ఆదాయం కోరుకునే వారికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని పోస్టాఫీస్ మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్ (POMIS) ఒక ఆకర్షణీయమైన ఎంపికగా మారుతోంది. స్టాక్ మార్కెట్ ఒడిదుడుకులకు సంబంధం లేకుండా, ఈ పథకం 100 శాతం భద్రతతో పాటు స్థిరమైన రాబడిని అందించడం దీని ప్రధాన ప్రత్యేకత.

ప్రస్తుతం ఈ పథకంపై ప్రభుత్వం సంవత్సరానికి 7.4 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ వడ్డీ ప్రతి నెలా ఆదాయంగా పెట్టుబడిదారుల ఖాతాలో జమ అవుతుంది. ముఖ్యంగా రిటైర్డ్ వ్యక్తులు లేదా రెగ్యులర్ ఇన్‌కమ్ కోరుకునే కుటుంబాలకు ఇది మంచి ఆర్థిక భరోసాగా నిలుస్తోంది.

ఉదాహరణకు మీరు జాయింట్ ఖాతా ద్వారా రూ.15 లక్షలు పెట్టుబడి పెడితే, ఏడాదికి సుమారు రూ.1,11,000 వడ్డీ వస్తుంది. దీన్ని నెలల వారీగా విభజిస్తే, ప్రతి నెలా సుమారు రూ.9,250 స్థిరమైన ఆదాయం లభిస్తుంది. అదే విధంగా ఒక వ్యక్తి పేరుతో రూ.9 లక్షలు పెట్టుబడి పెడితే, సంవత్సరానికి రూ.66,600 వడ్డీ లభిస్తుంది.

ఈ పథకంలో పెట్టుబడి కాలపరిమితి 5 సంవత్సరాలు. ఈ కాలం పూర్తయ్యాక, మీరు పెట్టిన అసలు మొత్తం పూర్తిగా తిరిగి పొందుతారు. ఆ తర్వాత మీకు అవసరమైతే మళ్లీ అదే పథకంలో రీఇన్వెస్ట్ చేసి నెలవారీ ఆదాయాన్ని కొనసాగించవచ్చు.

పథకం సౌలభ్యం కూడా వినియోగదారులను ఆకట్టుకుంటోంది. ఒక వ్యక్తి సింగిల్ ఖాతా లేదా గరిష్టంగా ముగ్గురు వ్యక్తులతో జాయింట్ ఖాతా తెరవవచ్చు. అదనంగా, 10 సంవత్సరాల పైబడిన పిల్లల పేరుతో కూడా తల్లిదండ్రులు ఖాతా తెరిచి, వారి భవిష్యత్తు కోసం పొదుపు ప్రారంభించవచ్చు. ఖాతా ప్రారంభించడం కూడా చాలా సులభం. సమీప పోస్టాఫీస్‌లో సేవింగ్స్ అకౌంట్ తెరిచి, అవసరమైన డాక్యుమెంట్లు సమర్పిస్తే సరిపోతుంది. ప్రస్తుత నిబంధనల ప్రకారం PAN కార్డ్, ఆధార్ కార్డ్ తప్పనిసరి.