
PM Kisan: దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఇప్పుడు ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పీఎం-కిసాన్) పథకం 23వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా రైతుల బ్యాంకు ఖాతాలకు రూ. 2,000 జమ చేయనుంది కేంద్రం. అయితే ప్రభుత్వం ఇంకా తదుపరి విడత అధికారిక తేదీని ప్రకటించనప్పటికీ, గత రికార్డులను బట్టి చూస్తే, ఈ మొత్తం వచ్చే నెల జూన్ లేదా జూలై 2026 నాటికి రైతుల ఖాతాలకు చేరవచ్చని భావిస్తున్నారు. అంతకుముందు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2026 మార్చి 13న అస్సాంలోని గౌహతి నుండి 22వ విడతను విడుదల చేశారు. దీని తర్వాత, రైతులు ఇప్పుడు తదుపరి విడత కోసం ఎదురుచూస్తున్నారు.

ఈ పథకం కింద అర్హులైన రైతు కుటుంబాలు ఏటా రూ.6,000 ఆర్థిక సహాయం పొందుతాయి. ఈ మొత్తాన్ని రూ.2,000 చొప్పున మూడు వాయిదాలలో నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు బదిలీ చేస్తారు. వ్యవసాయం, సంబంధిత ఖర్చుల విషయంలో రైతులకు సహాయపడటమే దీని ముఖ్య ఉద్దేశ్యం.

తదుపరి వాయిదా పొందడానికి ఏమి అవసరం?: ఇ-కేవైసి, ఆధార్ అనుసంధానం తప్పనిసరిగా పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టంగా పేర్కొంది. ఇంకా ఇ-కేవైసి పూర్తి చేయని రైతులు తమ వాయిదాల చెల్లింపులలో జాప్యాన్ని ఎదుర్కోవచ్చు. రైతులు ఓటీపీ ఉపయోగించి ఆన్‌లైన్‌లో ఇ-కేవైసిని పూర్తి చేయవచ్చు. బయోమెట్రిక్ ఇ-కేవైసి కోసం, వారు సమీపంలోని సిఎస్‌సి కేంద్రాన్ని సందర్శించవలసి ఉంటుంది. అంతేకాకుండా, ఆధార్ నంబర్‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానించడం అత్యవసరం. కొన్నిసార్లు చిన్న సాంకేతిక లోపాలు లేదా అసంపూర్ణ సమాచారం కారణంగా చెల్లింపులు ఆలస్యం కావచ్చు.

ఎవరి వాయిదాలను నిలిపివేయవచ్చు?: ప్రభుత్వం కూడా కొన్ని కేసులను విచారిస్తోంది. ఒకే కుటుంబానికి చెందిన పలువురు ఈ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నా, లేదా భార్యాభర్తలిద్దరి ఖాతాలకు డబ్బు బదిలీ అవుతున్నా, చెల్లింపులను నిలిపివేసే అవకాశం ఉంది. ఒకటిరి మాత్రమే ఈ ప్రయోజనం అందుతుంది. అదనంగా, ఫిబ్రవరి 1, 2019 తర్వాత జరిగిన భూ కొనుగోళ్లకు సంబంధించిన కొన్ని కేసులను కూడా విచారిస్తున్నారు. తదుపరి వాయిదా ఎటువంటి ఇబ్బంది లేకుండా వారి ఖాతాలకు జమ అయ్యేలా రైతులు తమ పత్రాలను సకాలంలో అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.

మీ వాయిదాల స్థితిని ఈ విధంగా తనిఖీ చేసుకోండి: రైతులు పీఎం-కిసాన్ పోర్టల్‌ను సందర్శించడం ద్వారా ఇంటి నుంచే తమ వాయిదాల సమాచారాన్ని చూసుకోవచ్చు. దీనికోసం వెబ్‌సైట్‌లోని 'బెనిఫిషియరీ స్టేటస్' విభాగానికి వెళ్లి, మీ ఆధార్ నంబర్, మొబైల్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా వివరాలను నమోదు చేయండి. అప్పుడు పూర్తి వాయిదాల సమాచారం స్క్రీన్‌పై కనిపిస్తుంది.