
అక్టోబర్ నెల నుంచి దేశ ప్రజలను ఆర్ధికంగా ప్రభావితం చేసే అనేక భారీ మార్పులు అమల్లోకి వస్తున్నాయి. యూపీఐ ఛార్జీలు, కొత్త ఫిక్స్‌డ్ డిపాజిట్ రూల్స్, గ్యాస్ సిలిండర్ల కేవైసీ వరకు అనేక కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. కోటీశ్వరుల నుంచి సామాన్య ప్రజల వరకు ప్రతీఒక్కరికీ ఇవి ప్రభావితం చేయనున్నాయి. దీంతో అక్టోబర్ నుంచి మారనున్న రూల్స్ గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆర్ధిక లావాదేవీలు పెద్ద మొత్తంలో నిర్వహించేవారు, గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్నవారు, ఫిక్స్‌డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు వీటి గురించి అవగాహన కలిగి ఉండాలి

అక్టోబర్ 15వ తేదీ యూపీఐ లావాదేవీలకు చార్జీలు విధించనున్నారు. రూ.2 వేలకు మించి చేసే మర్చంట్ పేమెంట్స్‌పై 0.4 శాతం ఎండీఆర్ ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. వీటిని వినియోగదారుల నుంచి కాకుండా వ్యాపారుల వద్ద నుంచి బ్యాంకులు, పేమెంట్ అగ్రిగేటర్లు వసూలు చేస్తారు. రూ.75 వేలకుమించి చేసే ట్రాన్సాక్షన్లకు రూ.300 వరకు ఛార్జీలు విధిస్తారు. వ్యక్తుల మధ్య జరిగే లావాదేవీలు పూర్తిగా ఉచితం.

చిన్న వ్యాపారులకు నెలకు రూ.లక్ష వరకు ఎలాంటి ఛార్జీలు ఉండవు. ఆ లిమిట్ దాటితే ఛార్జీలు చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఇన్యూరెన్స్ ప్రీమియం, ఇంధన కొనుగోలు, రైల్వే టికెట్లు, స్టాక్ మార్కెట్, మ్యూచువల్ ఫండ్స్ పెట్టబడులకు సంబంధించిన ట్రాన్సాక్షన్లపై కూడా యూపీఐ ఛార్జీలు విధించనున్నారు. అయితే వీటి వల్ల సామాన్యులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.

ఇక అక్టోబర్ 1 నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్లకు ఆర్బీఐ కొత్త రూల్స్ తీసుకొచ్చింది. రూ.3 కోట్లకుమించి చేసే బల్క్ ఎఫ్‌డీలకు సంబంధించి వడ్డీ రేట్లను బ్యాంకులు ఉదయం 10 గంటల్లోపు తమ వెబ్‌సైట్లలో పొందుపర్చాలి. 10 నిమిషాల పాటు గ్రేస్ పీరియడ్ ఉంటుంది. 10.10 గంటల్లోపు అప్డేట్ చేయాల్సి ఉంటుంది. ఒక బ్యాంక్‌కు సంబంధించిన అన్ని శాఖల్లోనే ఒకే రకంగా వడ్డీ రేట్లు ఉండాలని ఆర్బీఐ ఆదేశించింది.

అక్టోబర్ 1వ తేదీ నుంచి డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ ఈకేవైసీని కేంద్రం తప్పనిసరి చేసింది. దీంతో అక్టోబర్ 1లోపు తప్పనిసరిగా కేవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. లేకపోతే ఆ తర్వాత డొమెస్టిక్ సిలిండర్లకు ఇస్తున్న గ్యాస్ సబ్సిడీ కట్ అవుతుంది. ఆ తర్వాత మార్కెట్ ధరలకే సిలిండర్లను కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేవైసీ పూర్తి చేయనివారికి 5 లేదా 10 కేజీల సిలిండర్లను మాత్రమే అందిస్తారని ప్రచారం సాగుతోంది