
దేశంలో ఆర్థిక లావాదేవీల పారదర్శకతను పెంచడం లక్ష్యంగా PAN కార్డ్‌కు సంబంధించిన పలు కీలక మార్పులు ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఈ మార్పులు పాన్ కోసం దరఖాస్తు చేసే విధానం నుంచి, దాని వినియోగం వరకు ప్రభావం చూపనున్నాయి. ముఖ్యంగా ఇకపై పాన్ పొందడానికి కేవలం ఆధార్ కార్డు మాత్రమే సరిపోదు. దరఖాస్తుదారులు తమ గుర్తింపు, పుట్టిన తేదీని నిర్ధారించే అదనపు పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

ఆమోదయోగ్యమైన పత్రాల జాబితాలో జనన ధృవీకరణ పత్రం, ఓటర్ ఐడి, 10వ తరగతి సర్టిఫికేట్, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ లేదా మేజిస్ట్రేట్ జారీ చేసిన అఫిడవిట్ వంటి పత్రాలు ఉన్నాయి. అలాగే పాన్ కార్డులోని పేరు తప్పనిసరిగా ఆధార్‌లో ఉన్న వివరాలతో సరిపోలాలి. దరఖాస్తుదారులు తమ కేటగిరీకి అనుగుణంగా ప్రత్యేక ఫారమ్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.

ఇక పాన్ వినియోగానికి సంబంధించిన నిబంధనల్లో కూడా మార్పులు చేశారు. ఒక ఆర్థిక సంవత్సరంలో మొత్తం నగదు డిపాజిట్లు లేదా విత్‌డ్రాయల్స్ రూ.10 లక్షలు దాటితే మాత్రమే పాన్ వివరాలు అవసరం అవుతాయి. వాహనం కొనుగోలు విషయంలో ధర రూ.5 లక్షలు మించితేనే పాన్ తప్పనిసరి. భీమా పాలసీల విషయంలో మాత్రం ప్రతి పాలసీకి పాన్ తప్పనిసరి చేస్తూ నిబంధనలను కఠినతరం చేశారు.

ఆస్తి లావాదేవీలకు సంబంధించిన పరిమితిని రూ.10 లక్షల నుంచి రూ.20 లక్షలకు పెంచారు. అలాగే హోటళ్లు, రెస్టారెంట్లు లేదా ఈవెంట్‌లలో నగదు చెల్లింపులపై పాన్ అవసరమైన పరిమితిని రూ.50,000 నుంచి రూ.1 లక్షకు పెంచారు. ఈ మార్పుల నేపథ్యంలో పాన్ కోసం దరఖాస్తు చేసుకునే వారు ముందుగానే అవసరమైన పత్రాలను సిద్ధం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఆధార్‌లోని వివరాలు సరిగా ఉన్నాయో లేదో ధృవీకరించుకోవడం, కొత్త ఫారమ్‌లను ఉపయోగించడం వంటి అంశాలు దరఖాస్తు ప్రక్రియలో జాప్యాలను నివారించడంలో కీలకంగా మారనున్నాయి.