
ఆస్తి కొనుగోలు అనేది సగటు మనిషి జీవితంలో ఒక అతిపెద్ద ఆర్థిక లక్ష్యం. అయితే, ఈ ప్రక్రియలో సరైన అవగాహన లేకపోతే జీవితకాల కష్టార్జితం మోసగాళ్ల పాలయ్యే ప్రమాదం ఉంది. న్యాయవాది ఆకుల రమ్య కుమారి అందించిన సూచనల ప్రకారం, ఒక ఆస్తిని కొనేముందు కొనుగోలుదారులు పాటించాల్సిన చట్టపరమైన జాగ్రత్తలు ఇక్కడ ఉన్నాయి.

చాలామంది తక్కువ ధరకు వస్తుందని నోటరీ డాక్యుమెంట్లతో కూడిన ఆస్తులను కొనుగోలు చేస్తుంటారు. కేవలం రూ. 100 బాండ్ పేపర్‌పై జరిగే ఇటువంటి లావాదేవీలకు చట్టబద్ధత ఉండదు. ప్రభుత్వం ఎప్పుడైనా ఇటువంటి ఆస్తులను స్వాధీనం చేసుకునే హక్కు కలిగి ఉంటుంది. కాబట్టి, నోటరీ ప్రాపర్టీలను కొనడం అత్యంత ప్రమాదకరమని గుర్తించాలి.

రిజిస్ట్రేషన్ ప్రాపర్టీల విషయంలో కనీసం 30 ఏళ్ల లింక్ డాక్యుమెంట్లను పరిశీలించడం అవసరం. అలాగే ఎన్‌కంబరెన్స్ సర్టిఫికేట్ (EC) ద్వారా ఆస్తి చరిత్రను, గత లావాదేవీలను నిశితంగా తనిఖీ చేయాలి. ఎల్‌ఆర్‌ఎస్ (LRS), బీఆర్‌ఎస్ (BRS) వంటి అనుమతులు సక్రమంగా ఉన్నాయో లేదో నిర్ధారించుకోవాలి.

బ్యాంక్ లోన్ మంజూరైతే ఆస్తి డాక్యుమెంట్లు అన్నీ సరిగ్గా ఉన్నాయని భావించడం ఈ రోజుల్లో సరైనది కాదు. ప్రస్తుత ప్రైవేట్ బ్యాంకింగ్ వ్యవస్థలో కేవలం మీ రీపేమెంట్ సామర్థ్యాన్ని బట్టి కూడా లోన్లు ఇస్తున్నారు. అందుకే లోన్ రావడమే ప్రామాణికం అనుకోకుండా, సొంతంగా లేదా న్యాయవాది ద్వారా డాక్యుమెంట్లను వెరిఫై చేయించుకోవాలి. అలాగే ఆస్తిపై కోర్టు కేసులు లేదా స్టే ఆర్డర్లు ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి చుట్టుపక్కల ఎంక్వైరీ చేయడం అవసరం. అగ్రిమెంట్ రాసుకునేటప్పుడు ఆస్తిపై ఎటువంటి వివాదాలు లేవని స్పష్టంగా పేర్కొనాలి.

ఆస్తి కొనుగోలులో అగ్రిమెంట్ ఆఫ్ సేల్ (అమ్మకం ఒప్పందం) అత్యంత కీలకమైన పత్రం. టోకెన్ అమౌంట్ ఇచ్చినప్పుడే ఈ ఒప్పందం చేసుకోవాలి. ఇందులో రిజిస్ట్రేషన్ గడువు, చెల్లింపు వివరాలు, మరియు షరతులను స్పష్టంగా రాయాలి. ఒకవేళ అమ్మకందారు ఒప్పందాన్ని ఉల్లంఘించి వేరే వారికి అమ్మాలని చూస్తే, ఈ అగ్రిమెంట్ ఆధారంగా సివిల్ కోర్టులో కేసు వేసే అవకాశం ఉంటుంది. వారసత్వ ఆస్తులను కొనేటప్పుడు లీగల్ హెయిర్ సర్టిఫికేట్, కుటుంబ సభ్యుల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించాలి. ఆస్తి యజమాని వారసులందరి అంగీకారం ఉందో లేదో సరిచూసుకోవడం ముఖ్యం. ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడే మీ ఆస్తి కొనుగోలు సురక్షితంగా మారుతుంది.