
దేశంలోని నలుమూలకు రైల్వే నెట్‌వర్క్ విస్తరించి ఉంది. రోజూ లక్షలాది మంది రైళ్లల్లో ప్రయాణం చేస్తూ ఉంటారు. రైలు ప్రయాణం సురక్షితమనే భరోసాతో పాటు సౌకర్యవంతంగా ఉంటుందనే ఉద్దేశంతో ఎక్కువమంది ప్రయాణించేందుకు ఇష్టపడుతుంటారు. అయితే ప్రయాణికులను భద్రంగా తమ గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు ప్రయాణంలో జరిగే ప్రమాదాలు, ఆలస్యం, లగేజీ పోవడం వంటి వాటికి బాధ్యత వహించి పరిహారం కూడా రైల్వేశాఖ అందిస్తోంది.

రైలు ప్రయాణం చేసేటప్పుడు లగేజీ పోయినా, లగేజీకి నష్టం జరిగినా, రైలు నుంచి జారి పడి మరణించినా, రైలు తలుపు వద్ద నుంచి పడిపోయినా, ఏదైనా ప్రమాదం జరిగి గాయపడినా పరిహారం అందిస్తోంది. అయితే దీని గురించి చాలామందికి అవగాహన లేక క్లెయిమ్ చేసుకోలేకపోతున్నారు. కొద్ది మంది మాత్రమే క్లెయిమ్స్ పొందుతున్నారు. దీనికి కారణం సరైన ప్రచారం లేకపోవడమేనని చెప్పవచ్చు.

రైలు ప్రయాణం చేసేటప్పుడు ట్రైన్ నుంచి జారి కిందపడి మరణించడం లేదా గాయపడటం, తలుపు వద్ద నుంచి పడిపోవడం, రైలు ఎక్కేటప్పుడు లేదా దిగేటప్పుడు కిందపడటం, ట్రైన్ ప్రయాణంలో లేగేజీ కోల్పోవడం లేదా నష్టపోవడం, మీరు రైళ్ల ద్వారా పంపే సరుకుకు నష్టం జరగడం, రైలు ప్రమాదంలో మరణించడం, గాయపడటం వంటివి చోటుచేసుకున్నప్పుడు క్లెయిమ్స్ పొందవచ్చు.

రైలు ప్రయాణంలో మరణించినప్పుడు కుటుంబసభ్యులు క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఘటన జరిగిన ఏడాదిలోపు క్లెయిమ్ కోసం అప్లై చేసుకోవాలి. దీనికి ఒక్క రూపాయి కూడా మీరు దరఖాస్తు ఫీజు, ఇతర ఛార్జీలు చెల్లించాల్సిన పని లేదు. రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ బెంచ్‌లో దరఖాస్తు సమర్పించాలి. ప్రయాణించిన రైల్వే టికెట్ అందించాలి. ఇక లగేజీకి నష్టం జరిగితే రసీదుతో పాటు వివరాలు, సాక్ష్యాలను చూపాలి.

మీరు నివసించే రాష్ట్రానికి సంబంధించిన రైల్వే క్లెయిమ్స్ ట్రైబ్యునల్ బెంచ్‌లో దరఖాస్తు చేసుకోవాలి. తెలంగాణలోని సికింద్రాబాద్, ఏపీలో గుంటూరులో ట్రైబ్యునల్ ఉంది. ఇక బెంగళూరు, నాగ్ పుర్, ముంబైలో ఉన్నాయి. అయితే ఆత్మహత్య, స్వయంగా చేసుకున్న గాయాలు, మరణాలకు ఇది వర్తించదు.