
నగదు లావాదేవీలకు సంబంధించి ఆదాయపు పన్ను శాఖ పలు పరిమితులు విధించింది. ఈ పరిమితికి మించి నగదు తీసుకున్నా లేదా వేరేవారికి ఇచ్చినా ఐటీ శాఖ నోటీసులు రావొచ్చు. అంతేకాకుండా భారీగా పెనాల్టీ విధిస్తారు. ప్రస్తుతం డిజిటల్ ట్రాన్సాక్షన్లు పెరుగుతున్నా చాలామంది ఇప్పటికీ క్యాష్ రూపంలో లావాదేవీలు నిర్వహిస్తూ ఉంటారు. ఎంత అయినా క్యాష్ రూపంలో ఇవ్వవచ్చని చాలామంది అనుకుంటూ ఉంటారు.

బ్లాక్ మనీని అరికట్టేందుకు క్యాష్ రూపంలో చేసే లావాదేవీలపై ఐటీ శాఖ పరిమితులు విధించింది. ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి రూ.2 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ క్యాష్ తీసుకోకూడదు. బిజినెస్ కార్యకలాపాల కోసం రోజుకు రూ.10 వేలకు మంచి నగదు చెల్లించినా ట్యాక్స్ పడుతుంది. ఇక అప్పు తీసుకోవడం, ప్రాపర్టీ కోసం అడ్వాన్స్ చెల్లించడం లాంటి వాటికి రూ.20 వేల పరిమితి విధించారు. ఈ లిమిట్ దాటి లావాదేవీలు చేస్తే 100 శాతం పెనాల్టీ విధిస్తారు.

ఎక్కువ మొత్తంలో క్యాష్ రూపంలో చెల్లిస్తే లెక్కలు చూపించని ఆదాయంగా పరిగణించి ఐటీ శాఖ పెనాల్టీ విధిస్తుంది. ఇక మీరు ఏదైనా లోన్ చెల్లించేందుకు రూ.20 వేలకు మించి నగదు రూపంలో ఇవ్వకూడదు. అంతకంటే ఎక్కువ ఇవ్వాలంటే ఆన్ లైన్ లేదా చెక్ రూపంలో చెల్లించాలి. ఇక వ్యాపారులు ఒక రోజులో ఒక వ్యక్తి నుంచి రూ.10 వేలకు మించి క్యాష్ పేమెంట్లపై ట్యాక్స్ డిడక్షన్ క్లెయిమ్ చేసుకోలేరు. ఇక రూ.2 వేలు దాటి క్యాష్ రూపంలో విరాళం ఇస్తే పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసకోవడం కుదరదు.

ఇక బ్యాంక్ అకౌంట్ నుంచి పెద్ద మొత్తంలో ఒకేసారి విత్ డ్రా చేసుకున్నప్పుడు సెక్షన్ 194ఎన్ కింద టీడీఎస్ కట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇక స్థలం కొనుగోలు, అమ్మకాల సమయంలో క్యాష్ పేమెంట్స్ రూ.20 వేల వరకు మాత్రమే చేసుకునేందుకు అనుమతి ఉంది. అంతకంటే ఎక్కువ చేయాలంటే ఆన్ లైన్ లేదా చెక్ రూపంలో చేయాలి.

పెద్ద మొత్తంలో నగదు తీసుకుంటే ఐటీ శాఖ నుంచి నోటీసులు అందుకునే ఛాన్స్ ఉంటుంది. ఇక ఒకేసారి కాకుండా నగదు విభజించి పెద్ద మొత్తంలో లావాదేవీలు చేస్తే ఇబ్బంది ఉండదని చాలామంది అనుకుంటారు. కానీ చిన్న మొతాల్లో లావాదేవీలు చేసినా మొత్తాన్ని ఒకే ట్రాన్సాక్షన్‌గా పరిగణిస్తారు. దీని వల్ల భారీగా పెనాల్టీ పడుతుంది.