
దీపావళి వచ్చేయడంతో చాలామంది బంగారంవైపు చూస్తున్నారు. పండక్కి గోల్డ్ కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. పండుగలకు బంగారం కొనే సంప్రదాయం ఎప్పటినుంచో కొనసాగుతోంది. దీపావళికి బంగారం కొంటే మంచి జరుగుతుందనే నమ్మకంతో చాలామంది కొనుగోలు చేసేందుకు ముందుకొస్తుండటంతో షాపుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఆభరణాల రూపంలోనే కాకుండా కాయిన్స్, కడ్డీల రూపంలో పసిడి కొంటున్నారు

అయితే బంగారం కొనుగోలు చేసిన తర్వాత చాలామంది తమ భార్య పేరుపై బిల్లును జారీ చేయించుకుంటారు. ఇలాంటివారు ఆదాయపు పన్ను శాఖ నిబంధనల గురించి అవగాహన కలిగి ఉండటం ముఖ్యం. భార్య పేరుపై బంగారం కొన్నా, బహుమతిగా ఇచ్చిన డబ్బుతో ఆమె బంగారం కొనుగోలు చేసినా ఇన్కమ్ ట్యాక్స్ క్లబ్బింగ్ రూల్స్ వర్తిస్తాయి. ఈ విధానంలో కొనుగోలు చేసిన బంగారాన్ని భార్య విక్రయిస్తే.. దాని ద్వారా వచ్చిన లాభం భార్త ఆదాయానికే కలుపుతారు.

భర్త తన భార్యకు ఆస్తిని బదిలీ చేసినా.. ఆ ఆస్తి నుంచి వచ్చే లాభం కూడా భర్త ఆదాయనికి జోడిస్తారు. కొత్తగా అమల్లోకి వచ్చిన ఆదాయపు పన్ను చట్టం 2025లో సెక్షన్ 99 ప్రకారం తన భార్యకు భర్త ఆస్తిని ట్రాన్స్ఫర్ చేస్తే.. దాని నుంచి వచ్చే ఆదాయం భర్త ఆదాయంగానే పరిగణిస్తారు. దీంతో భర్తనే వీటికి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే భార్య తన సొంత సంపాదనతో కొనుగోలు చేస్తే నిబంధనలు వేరుగా ఉంటాయి.

భార్యకు భర్త బంగారాన్ని బహుమతిగా ఇస్తే ఎలాంటి పన్ను ఉండదు. కానీ ఆ బంగారాన్ని భార్య విక్రయించగా వచ్చే లాభాలపై పన్ను ఉంటుంది. ఇలాంటి సమయంలో క్లబ్బింగ్ నిబంధనలు వర్తిస్తాయి. భర్త నుంచి పొందిన డబ్బుతో భార్య బంగారం కొనుగోలు చేసి.. ఆ తర్వాత దానిని విక్రయించి లాభం పొందితే క్లబ్బింగ్ నిబంధన ప్రకారం భర్త ఆదాయానికి కలుపుతారు. వీటికి పన్ను రేటు వర్తిస్తుంది.

24 నెలలు లేదా అంతకంటే తక్కువ కాలం పాటు ఉంచిన బంగారాన్ని స్వల్పకాలిక మూలధన ఆస్తిగా చెబుతారు. ఈ లాభాన్ని భర్త ఆదాయానికి జోడిస్తారు. దీనిపై పన్ను శ్లాబ్ ప్రకారం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 24 నెలల కంటే ఎక్కువ కాలం పాటు ఉంచిన బంగారాన్ని దీర్ఘకాలిక మూలధన ఆస్తిగా పరిగణిస్తారు. దీనిపై 12.5 శాతం మూలధన లాభాల పన్ను విధించబడుతుంది.