
పీఎఫ్ ఖాతాదారులకు కేంద్రం బిగ్ అలర్ట్ జారీ చేసింది. సెప్టెంబర్ నెలకు సంబంధించిన కాంట్రిబ్యూషన్ అక్టోబర్ 31వ తేదీలోపు జమ కానుంది. ఇప్పటివరకు ఈపీఎఫ్ఓ నిబంధనల ప్రకారం ప్రతీ నెలా 15వ తేదీలోపు యాజమాన్యాలు ముందు నెలకు సంబంధించిన పీఎఫ్ చందాను జమ చేయాల్సి ఉండేది. కానీ గత నెల కాంట్రిబ్యూషన్ జమ చేసేందుకు ఈ నెల 31వ తేదీ వరకు కేంద్రం కంపెనీలకు గడువు పొడిగించింది.

కేంద్ర నిర్ణయం వల్ల యాజమాన్యాలకు పీఎఫ్ జమ చేయడానికి అదనంగా 16 రోజుల గడువు లభించినట్లయింది. కంపెనీలకు ఇది ఉపశమనం కలిగించే అంశంగా చెప్పవచ్చు. గత నెలలో కేంద్రం పీఎఫ్ గరిష్ట వేతన పరిమితిని రూ.15 వేల నుంచి రూ.25 వేలకు పెంచింది. దీని వల్ల పీఎఫ్, పెన్షన్ కాంట్రిబ్యూషన్లలో మార్పులు చోటుచేసుకోనున్నాయి. దీనిని సర్దుబాటు చేసుకునేందుకు కంపెనీలకు ఈ గడువు ఇచ్చారు

పీఎఫ్ వేతన పరిమితిలో వచ్చిన మార్పుల వల్ల తమ పేరోల్ను సర్దుబాటు చేసుకునేందుకు కంపెనీలకు సమయం పట్టనుంది. ఉద్యోగులు పీఎఫ్ కాంట్రిబ్యూషన్లను లెక్కించేందుకు పరిపాలనాపరమైన ఇబ్బందులు ఎదుర్కొనున్నారు. యాజమాన్యాలు తమ రికార్డులను మార్చుకునేందుకు, సరైన సమాచారంతో పీఎఫ్ జమ చేసేందుకు కేంద్రం మరింత సమయం ఇచ్చింది.

కేవలం గత నెలకు సంబంధించిన పీఎఫ్ కాంట్రిబ్యూషన్ జమ చేసేందుకు మాత్రమే అక్టోబర్ 31 వరకు గడువు కల్పించారు. వచ్చే నెల నుంచి నిబంధనల ప్రకారం 15వ తేదీలోపే జమ చేయాల్సి ఉంటుంది. దీంతో యజమానులు దీనిని గమనించాలని ఈపీఎఫ్ఓ స్పష్టం చేసింది. వచ్చే నెల నుంచి సాధారణ గడువులను పాటించాలని సూచించింది.

గత నెలకు సంబంధించి పీఎఫ్ చందా జమ అయిందా.. లేదా అనేది తమ పీఎఫ్ పాస్బుక్లో ఉద్యోగులు చూసుకోవచ్చు. సెప్టెంబర్ ఎంట్రీ కనిపిస్తే.. మీ అకౌంట్లో నగదు జమ అయినట్లు. ఎంట్రీ కనిపించకపోతే ఈ నెలాఖరు వరకు వేచి ఉండదు. నెలాఖరులో ఆన్లైన్లో పీఎఫ్ పాస్ బుక్ చెక్ చేసుకోండి.