
క్రెడిట్ కార్డులు ప్రస్తుతం నగదు లావాదేవీలకు ప్రత్యామ్నాయంగా వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. బై నౌ.. పే లేటర్ అనే సౌకర్యం వినియోగదారులను ఆకర్షిస్తున్నప్పటికీ, బిల్లును పూర్తిగా చెల్లించకుండా కేవలం మినిమమ్ డ్యూ మాత్రమే చెల్లించడం వల్ల భారీ ఆర్థిక భారం ఏర్పడే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

సాధారణంగా క్రెడిట్ కార్డు బిల్లును గడువు తేదీలోపు పూర్తిగా చెల్లిస్తే 20 నుంచి 50 రోజుల వరకు వడ్డీ రహిత కాలం లభిస్తుంది. అయితే ఒకసారి పూర్తి బిల్లు చెల్లించకుండా కొంత మొత్తాన్ని బకాయిగా ఉంచితే, ఆ సదుపాయం వెంటనే రద్దవుతుంది. ఆ తర్వాత బ్యాంకులు రోజువారీ ప్రాతిపదికన వడ్డీ లెక్కించడం ప్రారంభిస్తాయి.

ప్రస్తుతం చాలా బ్యాంకులు సంవత్సరానికి 30 శాతం నుంచి 45 శాతం వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. అంటే నెలకు సుమారు 2.5 శాతం నుంచి 3.5 శాతం వరకు వడ్డీ పడుతుంది. ముఖ్యంగా వినియోగదారులు భావించేలా కేవలం మిగిలిన బకాయిపైనే కాదు, కొనుగోలు చేసిన మొత్తం మొత్తంపైనా వడ్డీ వర్తించే అవకాశం ఉంటుంది.

ఉదాహరణకు రూ.50,000 బిల్లులో రూ.45,000 మాత్రమే చెల్లించి రూ.5,000 బకాయి ఉంచితే, వడ్డీ కేవలం రూ.5,000పై కాకుండా మొత్తం లావాదేవీపై కూడా పడవచ్చు. దీంతో బకాయి వేగంగా పెరుగుతుంది. కొత్తగా చేసే కొనుగోళ్లపై కూడా వెంటనే వడ్డీ వర్తించడం ప్రారంభమవుతుంది.

ఇక మినిమమ్ డ్యూ విధానం వినియోగదారులను అప్పు చక్రంలోకి నెట్టే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. కనీస చెల్లింపులు చేస్తూ ఉంటే ఎక్కువ భాగం వడ్డీకే వెళ్తుంది. అసలు బకాయి మాత్రం తగ్గదు. అధిక బకాయిలు క్రెడిట్ స్కోర్‌ను కూడా ప్రభావితం చేస్తాయి. అందువల్ల క్రెడిట్ కార్డులను జాగ్రత్తగా ఉపయోగించి, ప్రతి నెల పూర్తి బిల్లు చెల్లించడం ఉత్తమ ఆర్థిక అలవాటుగా నిపుణులు సూచిస్తున్నారు.