
అయితే బంగారం, వెండి ఇలా ఉంటే.. మరోవైపు రాగి ధరలు కూడా పెరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లో కాపర్ ధర 12000 డాలర్లు దాటేసి చరిత్ర సృష్టిస్తోంది. 2025లో ఏకంగా రాగి రేటు 35 శాతం పెరిగింది. 2009లో కాపర్ రేటు భారీగా పెరగ్గా.. ఆ తర్వాత ఈ ఏడాది మళ్లీ పెరిగినట్లు వ్యాపార వర్గాలు చెబుతున్నాయి.

ట్రంప్ సుంకాలతో రాగి ధర పెరుగుతుందేమోనని చాలామంది నిల్వ చేసుకుంటున్నారు. దీని వల్ల సరఫరా తగ్గిపోయి డిమాండ్ పెరగడంతో ధర పెరిగిందని చెప్పవచ్చు. అలాగే అంతర్జాతీయంగా రాగి ఉత్పత్తి కూడా భారీగా తగ్గింది. ఇదే కూడా వాటి ధరలు పెరగడానికి మరోక కారణంగా చెప్పవచ్చు.

ప్రస్తుతం బంగారం, వెండి రేట్లు ఊహించని స్ధాయిలో పెరుగుతున్న విషయం తెలిసిందే. అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితులు, ట్రంప్ సుంకాల క్రమంలో గత ఏడాది కాలంలో బంగారం ధరలు ఆల్ టైం రికార్డ్ నమోదు చేశాయి. ప్రస్తుతం తులం బంగారం రూ.లక్షా 40 వేలకు చేరుకోగా.. త్వరలో లక్షన్నర దాటి 2 లక్షలకు కూడా చేరుకునే అవకాశాలు కనిపిస్తున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

కాపర్ రేట్లు పెరుగుతుండటంతో వీటిని కొత్త బంగారం లేదా వెండిగా బిజినెస్ అనలిస్టులు పిలుస్తున్నారు. అయితే రాగి ధరలు పెరగడానికి అనేక కారణాలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకటి అంతర్జాతీయ పరిస్థితులు, రాజకీయ అనిశ్చితి కారణంగా తెలుస్తోంది. ఇక రెండోవది ట్రంప్ సుంకాలుగా మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

అలాగే రాగిని ఎలక్ట్రిక్, డేటా సెంటర్లు, గ్రీన్ ఎనర్జీ రంగాల్లో ఉపయోగించడం భారీగా పెరిగింది. దీని వల్ల డిమాండ్ పెరగడం కూడా ధరల పెరుగదులకు కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది బంగారం ధరలు 70 శాతం, వెండి ధరలు 140 శాతం పెరిగ్గా.. రాగి ధరలు కూడా భారీ స్థాయిలో పెరిగాయి.