
దసరా, దీపావళి పండుగలు వస్తున్న క్రమంలో ఈ-కామర్స్ వెబ్ సైట్లు, షాపింగ్ మాల్స్ అనేక ఆఫర్లను ప్రకటిస్తున్నాయి. ఇంట్లో ఉపయోగించే ఏసీ, వాషింగ్ మెషిన్, టీవీ, ఫ్రిడ్జ్ వంటి ఎలక్ట్రానిక్ వస్తువులపై భారీ తగ్గింపును అందిస్తున్నాయి. అయితే ఈ పండుగ సీజన్‌లో గృహోపకరణాల ధరలు భారీగా పెరగనున్నాయని తెలుస్తోంది. ముడి పదార్థాలు, రవాణా ఖర్చులు, రూపాయి విలువలో హెచ్చుతగ్గుల క్రమంలో ధరలను పెంచేందుకు ఎలక్ట్రానిక్ కంపెనీలు సిద్దమవుతున్నాయి.

అక్టోబర్ 1వ తేదీ నుంచి ధరలను పెంచేందుకు కంపెనీలు రెడీ అవుతున్నాయి. దాదాపు 5 నుంచి 8 శాతం వరకు ధరలను పెంచనున్నాయని తెలుస్తోంది. రాగి, ఉక్కు, అల్యూమినియం వంటి ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీకి ఉపయోగించే ముడి పదార్థాల ధరలు పెరగడంతో టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మెషిన్ లాంటి కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లయెన్స్ కంపెనీలు ధరలను పెంచనున్నాయి.

కొన్ని కంపెనీలు ఇప్పటికే ధరలను పెంచగా.. మరికొన్ని కంపెనీలు ఇప్పుడు ధరల పెంపుపై నిర్ణయం తీసుకుంటున్నాయి. ఈ ఏడాదిలో ధరలను పెంచడం ఇది మూడోసారి అని చెప్పవచ్చు. ఈ సారి ఏసీ ధరలు 5 నుంచి 8 శాతం వరకు పెరగనున్నాయి. కొన్ని ప్రీమియం బ్రాండ్ల ఏసీ ధరలు 10 శాతం వరకు పెరిగే ఛాన్స్ ఉంది. బ్లూ స్టార్, హైయర్, డైకిన్, సూపర్ ప్లాస్ట్రానిక్స్ వంటి ప్రీమియం ఏసీల ధరలు భారీగా పెరగనున్నాయి.

ఇక ఎల్ఈడీ టీవీలు, వాషింగ్ మెషిన్ల ధరలు 3 నుంచి 4 శాతం వరకు పెరగొచ్చు. థామ్సన్, కోడాక్, బ్లాపంక్ట్ వంటి టీవీ బ్రాండ్ల ధరలు అక్టోబర్ 1 నుంచి 7 శాతం వరకు పెరగనున్నాయి. ఇక రిఫ్రిజిరేటర్లు, డీప్ ఫ్రీజర్ల ధరలు 3 నుంచి 5 శాతం వరకు పెరిగే అవకాశముంది. దసరా, దీపావళి పండుగలు వస్తున్న క్రమంలో సామాన్య, మధ్యతరగతి ప్రజలకు ధరల భారం తప్పడం లేదు.

పశ్చిమాసియాలో యుద్దం పరిస్థితుల వల్ల ముడి సరుకు ధరలు పెరిగాయి. సరుకు రవాణా ఆలస్యం కావడంతో పాటు రవాణా ఖర్చులు రెండున్నర రెట్లు పెరిగాయి. ముడి చమురు ధరలు పెరగడం వల్ల ప్లాస్టిక్ మరింత ఖరీదయ్యాయి. ఇక ఇతర లోహల ధరలు కూడా భారీగా పెరిగాయి. మెమెరీ చిప్‌ల ధరలు కూడా పెరిగాయి.