
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్. దసరా సందర్భంగా మోదీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. 2025-26 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక బోనస్ను ప్రకటించింది. గ్రూప్ సీ, నాన్ గెజిటెడ్ గ్రూప్ బి ఉద్యోగులకు రూ.6908 వరకు అందనుంది. అయితే ఈ బోనస్ అందుకోవాలంటే ఈ ఏడాది మార్చి 31 నాటికి సర్వీసులో కొనసాగుతూ ఉండాలి.

ఇక తాత్కాలిక కార్మికులకు అర్హతల ప్రకారం రూ.1184 బోనస్ జమ కానుంది. సర్వీస్ కాలం, ఇతర షరతుల ప్రకారం బోనస్కు అర్హులు అవుతారు. ఏ ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ (PLB) పరిధిలోకి రాని ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది. కేంద్ర సాయుధ పోలీస్ బలగాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉద్యోగులకు కూడా బోనస్ చెల్లించనున్నారు. అసలు ఈ బోనస్ ఎలా లెక్కిస్తారనేది చూద్దాం.

ఉద్యోగి 30 రోజుల జీతం ఆధారంగా బోనస్ అనేది లెక్కిస్తారు. దీని కోసం నెలవారీ గరిష్ట వేతన పరిమితిని రూ.7 వేలుగా నిర్ణయించారు. ఉద్యోగి సగటు జీతం ఎక్కువగా ఉన్నా రూ.7 వేల పరిమితి ఆధారంగా లెక్కింపు ఉంటుందని కేంద్రం తెలిపింది. ఉద్యోగి సగటు జీతం రూ.7 వేల కంటే తక్కువగా ఉంటే దానికి అనుగుణంగా బోనస్ లెక్కించనున్నారు.

2025-26 ఆర్ధిక సంవత్సరంలో కనీసం ఆరు నెలల సర్వీస్ పూర్తి చేసి ఉండాలి. ఇక ఆరు నెలల నుంచి ఒక ఏడాది వరకు సర్వీస్ పూర్తి చేసినవారు దానిని అనుగుణంగా బోనస్ అందుకుంటారు. ఇక తాత్కాలిక ఉద్యోగుల విషయానికొస్తే.. వీరికి నెలవారీ పరిమితి రూ.1200 ఆధారంగా బోనస్ లెక్కిస్తారు. అసలు నెల జీతం రూ.1200 కంటే తక్కువగా ఉంటే జీతం ఆధారంగా లెక్కింపు ఉంటుంది.

తాత్కాలిక ఉద్యోగులకు సంబంధించి 6 రోజులు ఆఫీసుల్లో పనిచేసేవారు మూడేళ్ల పాటు ఏడాదికి 240 రోజులు పనిచేసి ఉండాలి. ఇక ఐదు రోజులు ఆఫీసుల్లో పనిచేసేవారు ఏడాదికి 206 రోజులు పనిచేసి ఉండాలి. ఈ నిబంధనల ప్రకారం బోనస్ అనేది చెల్లిస్తారు.