
కావలసిన పదార్థాలు: 4 పెద్ద పిడికిళ్లు సన్నగా తరిగిన తాజా పాలకూర తరుగు, అర లీటర్ చిక్కటి గడ్డ పెరుగు, 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి ముక్కలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు, రుచికి సరిపడా ఉప్పు , 1 టీస్పూన్ ఆవాలు, 2 టేబుల్ స్పూన్ల వంట నూనె, 2 ఎండు మిరపకాయలు, 1 టీస్పూన్ మినప్పప్పు, పావు టీస్పూన్ జీలకర్ర, 2 చిటికెళ్లు ఇంగువ

తయారీ విధానం: స్టీమర్ పాత్రలో నీరు పోసి చిల్లుల ప్లేట్ ఉంచాలి. దానిపై శుభ్రంగా కడిగి సన్నగా తరిగిన 4 పెద్ద పిడికిళ్ల పాలకూరను వేయాలి. మూతపెట్టి హై ఫ్లేమ్‌పై 12 నుండి 15 నిమిషాల పాటు పాలకూరను ఆవిరిపై మెత్తగా ఉడికించి పక్కన ఉంచుకోవాలి.

మిక్సీ జార్లో 3 టేబుల్ స్పూన్ల పచ్చి కొబ్బరి, 3 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం తరుగు వేయాలి. ఆవ ఘాటు ఇష్టపడేవారు 1 టీస్పూన్ ఆవాలు కూడా వేసుకోవచ్చు. కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. వేరొక బౌల్లో అర లీటర్ చిక్కటి పెరుగు తీసుకుని తగినంత ఉప్పు వేసి విస్కర్ లేదా గరిటెతో తరకలు లేకుండా చిలకాలి. ఇప్పుడు ఈ పెరుగులో రుబ్బిన పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలిపి 30 నిమిషాల పాటు ఫ్రిడ్జ్‌లో ఉంచాలి.

స్టవ్‌పై పాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేడిచేయాలి. నూనె కాగిన తర్వాత తుంచిన 2 ఎండుమిర్చి వేసి ఎర్రగా వేయించాలి. ఎండుమిర్చి వేగాక 1 టీస్పూన్ మినప్పప్పు, అర టీస్పూన్ ఆవాలు, పావు టీస్పూన్ జీలకర్ర వేసి పప్పులు ఎర్రబడేవరకు వేయించాలి. ఆ తర్వాత 2 చిటికెళ్ల ఇంగువ వేసి పొంగించాలి. తాలింపు ఘుమఘుమలాడుతున్నప్పుడు.. ముందుగా స్టీమ్ చేసి పెట్టుకున్న పాలకూరను వేసి కేవలం తాలింపు సువాసన పట్టేలా మీడియం మంటపై 3-4 నిమిషాలు మాత్రమే వేపి స్టవ్ ఆఫ్ చేయాలి (పాలకూరలోని నీరంతా ఇగిరిపోయేలా ఎక్కువగా వేపకూడదు.

వేగిన పాలకూర తాలింపు మిశ్రమాన్ని ఫ్రిడ్జ్ నుండి తీసిన చల్లటి పెరుగు మిశ్రమంలో వేసి స్పూన్‌తో బాగా కలిపేయాలి. అంతే, నోరూరించే చలువైన 'పాలకూర పెరుగు పచ్చడి' సిద్ధం! దీనిని కాసేపు ఫ్రిడ్జ్‌లో ఉంచి చల్లగా వేడివేడి అన్నంతో లేదా పుల్కా, చపాతీలతో తీసుకుంటే పొట్టకు ఎంతో హాయిగా, అమృతతుల్యమైన రుచితో ఉంటుంది!